వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
సీఎం రేవంత్‌రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి జరిగింది. రుణమాఫీ విషయంలో కవరేజీకి వెళ్లిన వీరిద్దరిపై కాంగ్రెస్ నాయకులు కొందరు అడ్డుకుని ఇబ్బందులకు గురి చేశారు. కవరేజీ చేయనీయకుండా ఆటంకాలు సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. దీనిపై కేటీఆర్ స్పందిచాడు. దీన్ని ఖండించాడు.
రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడం దారుణమన్నాడు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా ? రుణమాఫీ సరిగా జరిగి ఉంటే.. సీఎంకు అంత భయమెందుకు ? అని ప్రశ్నించాడు.
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని, వెంటనే కాంగ్రెస్ గుండాలపైన కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలన్నాడు.