( దండుగుల శ్రీనివాస్)
ఆర్మూర్ రైతులతో పెట్టుకుని బతికి బట్టకట్టినోడు లేడు. అక్కడి రైతులు అంటే అంతే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. కోపం వస్తే గద్దె దికేదాకా ప్రాణాలు తోడేస్తారు. వదిలిపెట్టరు. ఇక్కడి నాయకులకు ఆ సంగతి బాగా తెలుసు. అందుకే వారంటే భయం. సర్కార్‌కైనా ఆర్మూర్ రైతులంటే వణుకే. మాజీ సీఎం కేసీఆర్‌కు ఇక్కడి రైతుల ఆధునాతన వ్యవసాయ పద్దతులు తెలుసు. వారి ఐక్యత ఎలా ఉంటుందో కూడా తెలుసు. అందుకే వీరి జోలికి రారు. ఇప్పుడు మళ్లీ వీరిని కాంగ్రెస్ టచ్ చేసింది.
అదేంటీ మళ్లీ అంటున్నారు… అనేగా. ఓసారి ఎర్రజొన్నల కోసం రోడ్డెక్కారు ఇక్కడి రైతులు. అన్ని పార్టీలు కలిసినై. అంతా అఖిలపక్షంగా మారారు. ఎర్రజొన్నలకు మద్దతు ధర కోసం అలుపెరగని ఉద్యమం నడిపారు. కదం కదం కలిపారు. ఎవరి వచ్చినా వినలే. ఎన్ని మాటలు చెప్పినా నమ్మలే. కావాల్సింది దక్కించుకునేదాకా వదల్లే. ఈ ఐక్యకారాచరణ కమిటీ ఓ పిలుపిచ్చిందంటే మామాలుగా ఉండదు. తాడో పేడో తేలాల్సింది. ఆనాడు ఎర్రజొన్నల మద్దతు కోసం చేపట్టిన దీక్షతో అట్టుడికింది రాష్ట్రం. నాటి కాంగ్రెస్ సర్కార్ రైతులపై కాల్పులు జరిపే పరిస్థితి వచ్చింది. దీంతో ఇది మరింత రాజుకుందే తప్ప ఆగలేదు.
ఆనాటి నుంచి కాంగ్రెస్ పాలనకు అంతం మొదలైంది. పసుపుకు మద్దతు ధర ఇవ్వకుంటే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి కవిత ఓటమిపాలవ్వడానికి కారణమైంది కూడా ఇక్కడి రైతులే. ఇక చాలా రోజుల తరువాత మళ్లీ ఈ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కలిసింది. రుణమాఫీపై ఏదీ నిలదీస్తున్నది. ఈ నెల 24న చలో ఆర్మూర్‌కు పిలుపునిచ్చింది. ఇక తాడోపేడో తేల్చుకోనుంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే రేవంత్ సర్కార్‌కు అంతం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందనే చెప్పాలి.
రేవంత్ పదే పదే అంటాడు. ఇక్కడ రైతులు చేసిన ధర్నాలో పాల్గొన్న తరువాతే తనకు అన్నీ కలిసి వచ్చాయని, పీసీసీ చీఫ్‌ను కూడా అయ్యాయని. ఇప్పుడు సీఎం అయిన రేవంత్‌ను గద్దె దింపేందుకు కూడా ఈ చలో ఆర్మూర్ చరిత్రలో ఉండిపోయే ఉద్యమంలో నిలిచిపోనుందేమో ..? జర చూస్కో సీఎం సారు..!