(దండుగుల శ్రీనివాస్)
రుణమాఫీపై సర్కార్ యూటర్న్ తీసుకున్నది. నిన్నటి వరకు సంపూర్ణ రుణమాఫీ చేశామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం… కాదు కాదు ఇదింకా కొనసాగుతుందని తెలిపింది. రైతులు అంతటా రోడ్డెక్కడం, నిరసనలు తెలపడంతో మాట మార్చుకోకతప్పలేదు. దీనికోసం కొన్ని సాకులు వెతుక్కున్నది. దానికి టెక్నికల్ సమస్యలుగా చెప్పుకొచ్చింది. అవన్నీ సరిచేసుకుంటే మీకు మళ్లీ మేము రెండు లక్షలు ఖాతాలో వేస్తాం.. డోంట్ వర్నీ అంటూ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నది.
ఇది ఒడవని ముచ్చట అని చెప్పకనే చెప్పింది. మరి ఇంతమందికి రాలేదని తెలిసిన సర్కార్.. సంపూర్ణమని ఎలా ప్రకటించేసింది…? ఇది కదా రాజకీయం…? అంటే మెజార్టీకి చేసేశాం.. ఇదోలెక్కా అని సరిపెట్టుకున్నది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సగమే రుణమాఫీ అయ్యిందని గగ్గోలు పెడుతున్నారు. దీనికీ సర్కార్ దగ్గర సమాధానం ఉంది. పేదలకు మాత్రం వంద శాతం చేసేశాం. ఇదే మా లక్ష్యం. కాబట్టి మేం సంపూర్ణ రుణమాఫీ చేసేసినట్టేననేది సర్కార్ మదిలోని మాట. అందుకే ఇది ఇప్పట్లో ఒడవవి ముచ్చటే.
చివరగా ఓ ట్విస్టు.. ఈ ఆటంకాలన్నీ క్లియర్ చేసుకుని రుణమాఫీ పొందేందుకు ఓ నెలగడువిచ్చింది. ఆలోపు పడితే ఓకే. లేకపోతే అంతే సంగతులన్నమాట.
రుణమాఫీ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటన
• రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాల ప్రకారం చివరి విడతలో.. రూ.2 లక్షలకు మించి రుణాలున్న రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది. అంటే ఉదాహరణకు ఒక రైతుకు రూ.2.10 లక్షల రుణముంటే.. అదనంగా ఉన్న రూ.10 వేలు బ్యాంకులో జమ చేస్తే. ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.2 లక్షలు బ్యాంకులో జమ చేస్తుంది. వీరిని కలుపుకుంటే రుణమాఫీ మొత్తం మరింత పెరుగుతుంది. అర్హులైన రైతులందరికీ పూర్తిగా రుణ విముక్తి అవుతుంది.
• ఇప్పటివరకు రూ.2 లక్షల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పాసు బుక్ సరిగా, స్పష్టంగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఈ రుణమాఫీ జరిగింది. ఇందులో సందేహం లేనే లేదు.
• బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్ నెంబర్లలో తప్పులున్నవి, పాస్ బుక్ నెంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న పేర్లతో ఆధార్లో ఉన్న పేర్లతో సరిపోని ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి, వీటిని సరి చేసుకుంటే వీరి ఖాతాల్లో రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేస్తుంది.
• బ్యాంకులో టెక్నికల్ కారణాలతోనూ దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు కూడా వెనక్కి వచ్చాయి. వీటిలో ఉన్న చిన్న చిన్న తప్పులను గుర్తించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు సరి చేస్తుంది. ఇప్పటికే 8 వేల ఖాతాలకు తిరిగి డబ్బులు జమ చేసింది.
• అందుకే రూ.2 లక్షల లోపు రుణాలుండీ ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి.. అందుకు కారణం తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆధార్ లేదని గుర్తిస్తే.. వెంటనే ఆధార్ కార్డును ఎంఏవోకు అందించాలి.
• రూ.2 లక్షల లోపు రుణమున్నప్పటికీ, మాఫీ కాని రైతులెవరైనా ఉంటే ఆ బ్యాంకు బ్రాంచీ ఉన్న మండలం వ్యవసాయ అధికారిని (MAO) కలిసి ఫిర్యాదు చేయాలి. రుణమాఫీ పోర్టల్ లో రైతు పేరిట ఉన్న రైతు సమాచార పత్రంలో రుణ మాఫీ వర్తించిందా.. లేదా వర్తించకపోవడానికి కారణమేమిటో ఉంటుంది.
• ఆధార్ సరిగ్గా లేకుంటే వెంటనే ఆ రైతు తన సరైన ఆధార్తో పాటు, ఓటర్ ఐడీ లేదా, వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును ఎంఈవోకు అందించాలి. వాటిని పోర్టల్లో అప్ లోడ్ చేసి సరిచేసుకోవటం ద్వారా రుణమాఫీ పొందేందుకు అర్హులవుతారు.
• కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో రుణమాఫీ జరగలేదనే ఫిర్యాదులుంటే.. ఎంఈవో క్షేత్రస్తాయిలో వెరిఫికేషన్ చేస్తారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకోని పోర్టల్లో అప్లోడ్ చేస్తారు.
• ఆధార్ లో, బ్యాంకు ఖాతాలో ఉన్న రైతు పేరు సరిపోలకపోతే, రైతులు సరైన పేరున్న అప్ డేటేడ్ ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది.
• నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుంది.