(దండుగుల శ్రీ‌నివాస్‌)

గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థుల ఎంపిక విధానంలో రిజర్వేషన్లు అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాన మీడియా చేతులెత్తేసింది. తెలుగు పత్రికలు, ఛానళ్ల‌లో ఈ వార్తలకు సంబంధించిన ఒక్క కథనం కూడా ఇప్పటికీ ప్రచురితం కాలేదు… ప్రసారం చేయలేదు. జీఓ 29 అమలుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారనే అంశంపై నిరుద్యోగులు అరిచి గగ్గోలు పెడుతున్నా.. ప్రధాన మీడియా స్రవంతిలో ఉన్న పత్రికలు ఈ అంశంపై నాలుగు లైన్ల వార్త కూడా రాయలేదు.

కనీసం ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌ నేత మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఏకంగా తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి రిజర్వుడ్‌ అభ్యర్థులకు జరుగుతున్న నష్టాన్ని వివరించి జీఓ ప్రతులను ఇచ్చినప్పటికీ ఆ వార్త ప్రధాన పత్రికల్లో కేవలం సింగిల్‌ కాలమ్‌తో కనీసం కంటి చూపునకు అందనిచోట ఇరికించేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే ప్రధాన మీడియాకు ఎందుకంత కోపం… గొంతుపోయేలా అరుస్తున్నా వార్తలు రాకపోవడమేంటని ఇప్పుడు రిజర్వుడ్‌ వర్గాలకు చెందిన అభ్యర్థులు, నిరుద్యోగ వర్గాలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైన పోస్టులను అగ్రకులాలకు చెందిన అభ్యర్థులు తన్నుకుపోతున్న తీరును మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా అంతర్గత మద్దతు ఇస్తుందంటూ ఆగ్రహజ్వాలలు వెల్లగక్కుతున్నాయి.

టీజీపీఎస్సీకి ‘నమస్తే’…

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన పత్రికలు మద్దతు ఇస్తున్నాయని భావించినప్పటికీ… ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు కరపత్రంగా ఉన్న నమస్తే తెలంగాణ సైతం టీజీపీఎస్సీకి జీహుజూర్‌ అన్నట్లు వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఏకంగా అసెంబ్లీలో అరగంటపాటు ప్రసంగిస్తే ‘నమస్తే’లో కనీసం వార్త కూడా రాలేదు. ఇక ఆపార్టీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మీడియా సమావేశం నిర్వహిస్తే… ఆ వార్తకు నాలుగు రెట్లు పెద్దగా టీజీపీఎస్సీ అనుసరించిన తీరు అద్భుతమని ప్రచురించింది.

మీడియా సమావేశం నిర్వహించిన మరుసటి రోజు నమస్తే తెలంగాణ పత్రికను చూసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో పాటు బీఆర్‌ఎస్‌ శ్రేణులు సైతం బిత్తరపోయి తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు టీజీపీఎస్సీకి వత్తాసు పలుకుతూ వివరణాత్మక కథనాలను నమస్తే ఎందుకు ప్రచురించిందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కేవలం టీజీపీఎస్సీకి మాత్రమే వత్తాసు పలుకుతుందా? లేక రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే అన్ని కార్యక్రమాలకు అంతర్గత మద్దతు ఇస్తుందా? అనేది ఇప్పుడు అన్ని వర్గాల్లో నెలకొన్న అనుమానం.
ఫోన్లు చేసి రాజీ కుదర్చుకున్నారు…

టీజీపీఎస్సీ వైఫల్యాలు మీడియాలో రాకుండా ఉండేందుకు పెద్ద తతంగమే జరిగిందని పాత్రికేయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా వచ్చే వార్తలను కట్టడి చేసేందుకు కమిషన్‌లోని కీలక వ్యక్తులు మీడియా సంస్థల అధిపతులు, ఎడిటర్లకు నేరుగా ఫోన్లు చేసి రాజీ కుదుర్చుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఫలితంగా గ్రూప్‌–1 అవకతవకలపై వ్యతిరేక వార్తలు రావడం లేదని సమాచారం. ఈ రాజీ కుదర్చుకోవడంలో నమస్తే తెలంగాణ అతీతం కాదనేది ఆ పత్రికలో వచ్చే వార్తలను చూస్తే ఇట్టే తెలిసిపోతోంది.

You missed