వాస్తవం, ప్రధాన ప్రతినిధి: గ్రూప్–1 ఉద్యోగ ఆశావహులు, మేధావుల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ జీ.ఓ.29 పైనే. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న గ్రూప్–1 ఉద్యోగాల ప్రక్రియలో కీలకంగా మారిన జీఓ 29 వల్ల తీవ్రంగా నష్టపోతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు మాత్రమే. గత ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ.55 ప్రకారం అన్ని కేటగిరీల్లో రిజర్వేషన్లు పాటించి మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేయగా… జీ.ఓ.29 ప్రకారం కేవలం రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా టీజీపీఎస్సీ అ్యర్థులను ఎంపిక చేసింది.
తాజాగా చేసిన ఎంపిక ప్రక్రియలో ఓపెన్ కాంపిటేషన్ అభ్యర్థులు లబ్ధి పొందగా… రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రం వారి రిజర్వుడ్ కేటగిరీలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసు ఉద్యోగాలు భావించే గ్రూప్–1 ఉద్యోగాల భర్తీలో రేవంత్ సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందనే భావన ఇప్పుడు నిరుద్యోగ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఉత్తర్వులు జారీ వెనుక…
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఏప్రిల్‌లో ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ… ఈ ఏడాది ఫిబ్రవరిలో 563 ఉద్యోగాలతో మరో నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో గత నిబంధనలకు అధనంగా జీఓ 29 ప్రకారం మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. గతంలో జీఓ 55ను అనుసరిస్తూనే జీఓ 29 ప్రకారం ఎంపిక సాగుతుందని టీజీపీఎస్సీ మెలిక పెట్టింది. కానీ జీఓ 29 జారీలో ప్రభుత్వ ఉద్దేశ్యం కంటే టీజీపీఎస్సీ ఆసక్తే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు అర్హుల ఎంపిక విషయంలో మార్పులు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ, ఫిబ్రవరి 6వ తేదీన వేరువేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గతంలో ఉన్న జీఓ 55లోని పేరా ‘బి’లో సవరణలు చేయాలని కోరుతూ ఆ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. వీటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పేరా‘బి’లో సవరణలకు అనుమతిచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఓ 29ను ఫిబ్రవరి 2వ తేదీన జారీ చేశారు. ఆ తర్వాతే గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలైంది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు అవకాశం దక్కకుండా ప్రతిపాదనలు రూపొందించడం వెనుక అంతర్యం ఏమిటనేది ఇప్పుడు నిరుద్యోగ అభ్యర్థులు, ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేనప్పటికీ కొత్తగా మార్పులు చేపట్టడంపై ఇప్పటికే మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉద్యమిస్తున్నారు. జీఓ 29 వల్ల కేవలం అగ్రకులాల అభ్యర్థులు మాత్రమే లబ్ధి పొందుతారని, ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు శాపంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
======================
– జీఓ 55 ఉద్దేశ్యం:
మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను మల్టీజోన్ వారీగా న్న పోస్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరిస్తూ కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండీక్యిప్డ్, స్పొర్ట్స్ కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో గుర్తించాలి.
– జీఓ 29 ఏం చెబుతుంది:
మల్టీజోన్‌లో ఉన్న ఖాళీల సంఖ్యకు 50 రెట్లు అభ్యర్థుల ఎంపికను చేపట్టాలి. రిజర్వ్‌డ్ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటే కింది మెరిట్ ఆధారంగా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల్లో రూల్ 22, 22ఏ ఆధారంగా ఎంపిక చేయాలి. జీఓ 55లోని అంశం‘బి’లో మార్పులు చేసి జీఓ 29 ఇచ్చారు.
=========================