వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. దాదాపు పాత నిబంధనలే ఉన్నా.. వీటిని పక్కాగా అమలు చేస్తే చాల వరకు బోగస్‌కార్డలు ఎగిరిపోతాయి. ప్రభుత్వం సూచించిన ఆదాయ పరిమితి సర్టిఫికెట్లు మార్కెట్లో ఈజీగా తీసుకోవచ్చు. ఇది పెద్ద సమస్య కాదు. కానీ వాటిని పక్కా అమలు చేసి అర్హులకు మాత్రమే రేషన్‌కార్డు ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా మందికి కొత్తవి రాకపోగా, ఉన్నవి ఊస్టింగ్ అవుతాయి.
ఏళ్ల తరబడి ఏ ప్రభుత్వం ఉన్నా పథకాల అమలుకు బీపీఎల్ కింద ఉన్న కేటగిరీగా రేషన్‌కార్డులను కలిగి ఉన్న వారినే లబ్దిదారులుగా చేర్చుతుంది. ఇప్పుడైతే ఈ రేషన్‌కార్డు ప్రజలకు బంగారు బాతే అయ్యింది. ఎందుకంటే.. గత కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇబ్బడిముబ్బడిగా ప్రవేశపెట్టి అమలు చేసింది. వీటికి అర్హులుగా రేషన్ కార్డు ఉన్నవారినే లబ్దిదారులుగా చేర్చింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వమైతే అంతకుమించి హామీలిచ్చింది.
దీంతో మరింతగా రేషన్‌కార్డులకు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో ఇష్టమొచ్చినట్టు రేషన్‌కార్డులిస్తే ప్రభుత్వానికి విపరీతమైన ఆర్థిక భారం తప్పదు. ఇప్పటికే ఖజానా ఖాళీగా ఉంది. నిబంధనల పేరుతో ఇప్పటికే సంక్షేమ పథకాల లబ్దిదారులకు భారీగానే కత్తెర పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కొత్త రేషన్‌కార్డుల కోసం మార్గదర్శకాలు రూపొందించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఇప్పటికే పేర్ల మార్పు కోసం అవకాశం ఇస్తూ మీసేవాలో కరెక్షన్లకు వీలు కల్పించింది. వీటిని అలాగే ఉంచారు. ఇంకా ముందడుగు పడలేదు. ఇప్పుడు కొత్త రేషన్‌కార్డుల నిబంధనల పేరుతో కొత్తవాటికి, పాత వాటికి కత్తెర తప్పేలా లేదు. కేసీఆర్ సర్కార్ కూడా ఈ రేషన్‌కార్డుల జారీ విషయంలో ముందడుగు వేయలేదు. భయపడింది. కొత్తవాటి ఈసే ఎత్తలేదు. పాతవాటితోనే మొన్నటి వరకు నెట్టుకొచ్చింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ వంతైంది. ఏం చేస్తారో చూడాలి.