వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
ఏసీబీ అధికారులకు దొరికిన నరేందర్ తన అక్రమార్జనతో కమిషనర్ స్థాయికి ఎగబాకేందుకు అన్ని వర్గాల మద్దతు తీసుకున్నాడు. నిజామాబాద్‌లోనే కాదు హైదరాబాద్‌లోనూ ఉన్నతాధికారులతో, లీడర్లతో నరేందర్‌కు పరిచయాలున్నాయి. ఎవరికి ఏమేమివ్వాలో అంతా ఇచ్చాడు. భీమ్‌గల్ మున్సిపాలిటీకి కమిషనర్ అయ్యేందుకు అంతా సిద్దమయ్యింది.
ఇక రేపో మాపో ఉత్తర్వులు రావాల్సి ఉంది. కానీ ఈ విషయం తెలుసుకున్న అప్పటి మంత్రి దీన్ని అడ్డుకున్నాడు. అప్పటికే ఎవరో మంత్రికి నరేందర్ గురించి సమాచారం చేరవేశారు. చరిత్ర చెప్పారు. లీడర్లకు ఎలా అంటకాగుతాడో అవినీతిలో ఎంతలా ఎదిగిపోయాడో వివరించారు.
దీంతో నరేందర్ అంటే ఎలా ఉంటాడో కూడా తెలియని మంత్రి.. అతన్ని ఈ దరిదాపుల్లోకి రానీయకండని ఆదేశాలిచ్చాడు. దీంతో అంతా సవ్యంగా జరిగిందనుకున్న నరేందర్.. ఇక కమిషనర్ సీటుపై కూర్చుని అవినీతి సామ్రాజ్యంలో కొత్త శకం ఆరంభిద్దామని కలలు కన్న నరేందర్ ఆశలపై నీళ్లు పోశాడా మంత్రి.