వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్:
నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో సూపరింటెండెంట్‌గా, రెవెన్యూ ఆఫీసర్‌గా పనిచేసి ఏసీబీకి దొరికిన దాసరి నరేందర్ ఆస్తుల చిట్టా అంతా ఇంతా లేదు. బినామీల పేరుతో, వ్యాపారాల ముసుగులో విస్తరించిన సామ్రాజ్యం వందకోట్లకు చేరుకున్నది. ఏళ్లుగా ఒకే చోట తిష్ట వేసి అందరి సపోర్టుతో అవినీతిలో ఓ ఎత్తుకు ఎదిగి చివరకు ఏసీబీకి దొరికి నిజామాబాద్ ఇజ్జత్‌ను గంగలో కలిపిన నరేందర్ ఆస్తుల చిట్టాపై ఏసీబీ తీగలాగుతోంది.
వందగొడ్లను తిన్న రాబందు చివరకు ఒక్క తుఫాను దెబ్బకు నేలకొరిగిందన్నట్టు.. ఎమ్మెల్యేలతో సహా అందరి మద్దతు కూడగట్టుకుని ఇక తనుకు తిరుగులేదని విర్రవీగిన నరేందర్‌ను బైపాస్ భూమి కొనుగోలు వ్యవహారం ఏసీబీకి దొరకబట్టించింది. ఇప్పుడు ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మలేషియా, హైదరాబాద్‌లలో హోటళ్ల పేరుతో కోట్ల రూపాయల బిజినెస్ నడుపుతున్నాడు నరేందర్. నాందేడ్‌లో భూములు, జాగాలు, బైంసా, నిర్మల్ పదుల ఎకరాల్లో భూములు, ఆస్తులు .. ఇలా మొత్తంగా తాను సెంచరీకి చేరువలో ఎదిగాడు.