రిజర్వుడ్‌ అభ్యర్థులకు షాక్…!

గ్రూప్‌–1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో టీజీపీఎస్సీ ఇష్టారాజ్యం
మెరిట్‌ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను రిజర్వుడ్‌ కోటాకు పరిమితం చేశారంటూ విమర్శలు
దీంతో మెయిన్స్‌కు పెద్ద సంఖ్యలో అర్హత కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు
గ్రూప్‌–1 కేటగిరీలో భర్తీ చేయనున్న మొత్తం పోసులు 563
మెయిన్‌ పరీక్షలకు 1:50 నిష్పత్తితో 28,150 మందికే చోటు దక్కాలి
కానీ టీజీపీఎస్సీ చేసిన ఎంపిక జాబితాలో 31,382 మందికి అర్హత
పరిమితింఇ మించి 3232 మంది అభ్యర్థులకు అవకాశం కలగడంపై అభ్యర్థుల అనుమానాలు
రిజర్వేషన్‌కు బదులు రిలాక్సేషన్‌ పాటిస్తూ ఎంపిక చేశాం: టీజీపీఎస్సీ వర్గాలు

 

గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు అర్హుల ఎంపిక విధానంలో పారదర్శకత లోపించిందంటూ అభ్యర్థులు నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) అనుసరించిన విధానంతో ప్రధానంగా రిజర్వేషన్లున్న అభ్యర్థులు తీవ్ర నష్టపోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రిలిమనరీ పరీక్షల్లో అత్యుత్తమ మెరిట్‌ సాధించిన రిజర్వుడ్‌ అభ్యర్థులను కేవలం రిజర్వేషన్ల కేటగిరీకే పరిమితం చేశారంటుండగా… మరోవైపు 1:50 నిష్పత్తికే పరిమితం కాకుండా ఎక్కువ మందికి అవకాశం కల్పించడం పట్ల కూడా అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండేళ్ల క్రితం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ద్వారా చేపట్టిన ఎంపిక విధానంతో పోలిస్తే ప్రస్తుత అనుసరించిన విధానంలో టీజీపీఎస్సీ మార్పులు చేసింది. ఈ మార్పులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకే నష్టం జరిగిందనేది ప్రధాన వాదన. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్‌ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ… జూన్‌ నెల 24న అభ్యర్థుల ఓఎంఆర్‌ స్కాన్డ్‌ కాపీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడంతో పాటు ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని కూడా వెబ్‌సైట్‌లో పెట్టింది. ఆ తర్వాత ఈ జులై 7వ తేదీన తుది కీని విడుదల చేసిన టీజీపీఎస్సీ… అదేరోజు మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది.
అప్పుడలా… ఇప్పుడిలా…
ప్రిలిమినరీ పరీక్ష ఆధారంగా గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను 1:50 నిష్పత్తిలో చేపట్టనున్నట్లు కమిషన్‌ నోటిఫికేషన్‌ స్పష్టం చేస్తుంది. 2022 అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఆధారంగా మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను జీఓ 55 ఆధారంగా 1:50 నిష్పత్తిలో జరిగింది. దీంతో అప్పట్లో 503 పోస్టులకుగాను 25,150 మందిని ఎంపిక చేయాల్సి ఉండగా… రెండు కేటగిరీల్లో అభ్యర్థులు లేని కారణంగా 25,050 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో అప్పటి పరీక్షలన్నీ రద్దు కాగా… టీజీపీఎస్సీ ఈఏడాది ఫిబ్రవరిలో గ్రూప్‌-1 కేటగిరీలో 563 ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్‌ ఇచ్చింది. మెయిన్స్‌ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను జీఓ 29 ప్రకారం చేస్తామని వెల్లడించింది. గతంలో మల్టీజోన్‌ వారీగా జెండర్‌, కమ్యూనిటీ, జెండర్‌, ఈడబ్ల్యూఎస్‌, పీహెచ్‌సీ, స్పోర్ట్స్‌ కేటగిరీల్లో ఎంపిక అభ్యర్థుల ఎంపిక చేశారు. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రక్రియలో మల్టీజోన్‌ వారీగా ఉన్న ఖాళీల సంఖ్యకు అనుగుణంగా 50 రెట్లు గుర్తించారు. ఈ క్రమంలో 563 పోస్టులకు 50 రెట్లు అధికంగా 28150 మంది అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా… కమిషన్‌ 31382 మందిని ఎంపిక చేయడం… పరిమితికి మించి 3232 మందిని ఎక్కువగా ఎంపిక చేయడంపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అనుసరించిన విధానంలో రిజర్వేషన్లు పాటించకపోవడం… 1:50 నిష్పత్తిలో గుర్తించిన అభ్యర్థులల్లో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులనంతా ఒక వైపు, రిజర్వుడ్‌ అభ్యర్థులను ఆయా కేటగిరీల్లోకి చేర్చడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోయారని, ఈ విధానంలో మెరిట్‌ ఉన్న రిజర్వుడ్‌ అభ్యర్థులు కేవలం ఆయా కమ్యూనిటీలకే పరిమితమైనట్లు ఆరోపిస్తున్నారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమ్యూనిటీ వారీగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
టీజీపీఎస్సీ ఏం చెబుతుందంటే……
ఒకే ఉద్యోగానికి రెండుసార్లు రిజర్వేషన్లు అమలు చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దమని టీజీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల తర్వాత మెయిన్స్‌కు రిజర్వేషన్లు అమలు చేయకుండా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ)ని అనుసరిస్తూ కేవలం రిలాక్సేషన్‌ పద్దతిలో అభ్యర్థుల ఎంపిక చేశామంటున్నాయి. నోటిఫికేషన్‌లో ప్రస్తావించినట్లుగానే 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక చేసినట్లు వివరిస్తున్నాయి. మెయిన్స్‌ పరీక్షల తర్వాత అర్హత సాధించిన అభ్యర్థులను రిజర్వేషన్ల వారీగా విడుదల చేస్తామంటున్నాయి.
======================
– జీఓ 55 ఉద్దేశ్యం:
మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను మల్టీజోన్‌ వారీగా ఉన్న పోస్టులకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరిస్తూ కమ్యూనిటీ, జెండర్‌, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, అంగవైకల్య, క్రీడల కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో గుర్తించాలి.
– జీఓ 29 ఏం చెబుతుంది:
మల్టీజోన్‌లో ఉన్న ఖాళీల సంఖ్యకు 50 రెట్లు అభ్యర్థుల ఎంపికను చేపట్టాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటే కింది మెరిట్‌ ఆధారంగా తెలంగాణ స్టేట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనల్లో రూల్‌ 22, 22ఏ ఆధారంగా ఎంపిక చేయాలి. జీఓ 55లోని అంశం‘బి’లో మార్పులు చేసి జీఓ 29 ఇచ్చారు.
=========================
మార్పులు కోరింది టీజీపీఎస్సీనే…
గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ అంశంలో భాగంగా మెయిన్స్‌ పరీక్షలకు అర్హుల ఎంపిక విషయంలో మార్పులు చేయాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ, ఫిబ్రవరి 6వ తేదీన వేరువేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. గతంలో ఉన్న జీఓ 55లోని పేరా ‘బి’లో సవరణలు చేయాలని కోరుతూ ఆ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. వీటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పేరా‘బి’లో సవరణలకు అనుమతిచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఓ 29ను ఫిబ్రవరి 2వ తేదీన జారీ చేశారు. రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు అవకాశం దక్కకుండా ప్రతిపాదనలు రూపొందించడం వెనుక అంతర్యం ఏమిటనేది ఇప్పుడు నిరుద్యోగ అభ్యర్థులు, ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

You missed