(దండుగుల శ్రీనివాస్)
కేటీఆర్‌కు తృటిలో అదృష్టం తప్పింది. దురదృష్టం వెంటాడింది. అంటే అంత కాలమే చేసిందా..? కేటీఆర్ స్వయంకృతం ఏమీ లేదా..? ఉంది. ఇప్పటి ఈ పరిస్థితులకు కేటీఆర్‌దే కాదు కేసీఆర్‌దీ స్వయంకృతాపరాధమే. ఇంకా కేటీఆర్ తండ్రిచాటు బిడ్డే. ఏవీ సొంత నిర్ణయాలు ఉండవు. ఉన్నా కేసీఆర్ నడవనీయడు. అందుకే తన కోటరీ తను పెంచి పోషించుకుంటూ వచ్చాడు. అప్పటి సమయంలో అంతా యువరాజని కొనియాడిన ఆ భజనబృందం అంతా దూరమయ్యింది. సీఎం కావాల్సిన వాడు ఇప్పుడు ఏకాకి నేతగా మిగిలాడు.
కేసీఆర్ సీఎం అయిన తరువాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాడు. ఆదూరం కేటీఆర్ తగ్గించలేకపోయాడు. నమ్మకాన్ని ప్రోది చేసుకోలేకపోయాడు. కేసీఆర్ తరువాత కేటీఆరే సరైన లీడర్ అని అనిపించుకోలేకపోయాడు. కారణం.. తండ్రి లాగే కేటీయార్ కూడా ఓ అంహంభావి. ఆలోచన లేకుండా దుందుడుకుగా నోటికొచ్చింది మాట్లాడటం. ఎవరినీ కేర్ చేయకపోవడం, సీనియర్లను అసలు పట్టించుకోకపోవడం, గ్రూపులను పెంచి పోషించడం.. మొత్తంగా ఆ పార్టీ కొంపనే కాదు.. కేసీఆర్, కేటీఆర్ , కవిత కొంపలనూ ముంచాయి.
కేటీఆర్‌ను సీఎం చేయాలని అనుకున్నాడు కేసీఆర్. కానీ ఎక్కడో అనుమానం. మావోడు సీఎంగా సెట్ అవుతాడా..? అని. అందుకే అన్ని అధికారాలు ఇవ్వలేదు. సొంత నిర్ణయాలను అమలు కానీయలేదు. చెప్పినవన్నీ చేయలేదు. దీంతో అటు అధికార బృందానికి, ఇటు భజన బృందానికి డౌట్ వచ్చింది. కాబోయే యువరాజు కోరలు పీకిన పాములా ఉన్నాడే అని. కానీ మళ్లీ కేసీఆర్ రావచ్చేమో అని చిన్న అనుమానంతో మొన్నటి వరకు అంటిపెట్టుకుని ఉన్నారు. గోతికాడి నక్కల్లా కాచుక్కూర్చున్నారు. అందరూ ఊహించినట్టే జరిగింది. తండ్రి, కొడుకుల అహంకారినికి చెంప పెట్టు సమాధానం ఇచ్చారు ప్రజలు. నెత్తికెక్కిన ఇద్దరి కళ్లను నేలకు దించారు. ఇక జన్మలో కేటీఆర్ సీఎం కాలేడు అనే నమ్మకం మాత్రం ఆ భజన బృందానికి వచ్చేసింది.
అసలు మళ్లీ బీఆరెస్ అధికారంలోకి వస్తుందా..? కేసీఆర్ సీఎం అవుతాడా అనేదే పెద్ద డౌట్‌గా ఉంది. ఎందుకంటే, కేసీఆర్ ఇంకా మారలే. మళ్లీ అవే ఫామ్ హౌజ్ రాజకీయాలు. ఇంకా తను సీఎం అనే మానియాలో ఉన్నాడు. పదవి పోయిందనే బాధలో ఉన్నాడు. ప్రజలపై కక్ష పెంచుకుని కసితీరా కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. ఆలోపు ఉన్న నేతలంతా చేయిదాటిపోతూ ఉన్నారు. ఈ మారని నేతల తలరాతలు మార్చేసి పడేశారు జనాలు . మార్పు రాని ఈ నేతలను ఇప్పట్లో అంగీకరించే పరిస్థితులు కూడా కనిపించడం లేదు.
చివరగా.. కేటీఆర్ అంటే జనాలకు సింపతీ లేదు. అసలు సదాభిప్రాయమూ లేదు. కేసీఆర్‌నే అంతో ఇంతో ఇప్పటికీ నమ్ముతున్నారు. ఆ కొద్ది పాటి నమ్మకమూ ప్రజల వద్ద చూరగొనలేకపోయాడు కేటీఆర్. ఇక ఈయన భావితరాల భవిష్యత్ నేత ఎలా అవుతాడు..? కలలు కన్న సీఎం సీటు ఎలా ఎక్కుతాడు..?? సాధ్యమయ్యే పనైతే కాదు ఇప్పటికైతే.