తడబాటు… దిద్దుబాటు..!

రేవంత్‌ సర్కార్‌

స్టార్టింగ్‌ ట్రబుల్స్‌..!

షరతుల పేరుతో నవ్వులపాలు..

ఆపై దిద్దుబాటు చర్యలు..

‘పెన్షన్‌ రివకరీ’పై తీవ్ర వ్యతిరేకత.. వెంటనే వెనక్కి తగ్గిన వైనం..

‘రుణమాఫీ’పైనా రేషన్‌కార్డు లింకు.. ఆపై వెల్లువెత్తిన వ్యతిరేకతతో పీచేముడ్‌

‘రైతుభరోసా’పై ఐదెకరాల సీలింగ్‌… దీనిపైనా మిశ్రమ స్పందన..

నిరుద్యోగల విషయంలోనూ సీఎం దూకుడు మాటల ప్రభావం..

రాబోయే ఎన్నికలపై ఈ తప్పటడుగుల ప్రభావం …

Dandugula Srinivas

Senior Journalist

8096677451

ఎవరిస్తున్నారో తెలియదు సలహాలు! పథకాల అమలు వెనుక షరతుల నిబంధన ఎవరి ఆలోచనో తెలియదు!! రేవంత్‌ సర్కార్‌ నోట ఈ షరతుల ముచ్చట బయటకు రాగానే ఏదో వివాదం తలెత్తుతున్నది. వ్యతరేకత వస్తన్నది. ప్రతిపక్షానికి ఓ ఆయుధం దొరుకుతున్నది. వెంటనే అది తడబాటని తెలుసుకుంటున్నారు. దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. కానీ అప్పట్లోగా ఎంత ప్రచారం జరగాలో.. ఎంత డ్యామేజీ జరగాలో జరిగిపోతున్నది. ప్రతిపక్షం ఈ విషయాలను వెంటనే అందిపుచ్చుకుంటున్నది. ఇది జరిగే ముందే సర్కార్‌ ఆలోచించాలి. కానీ తెలిసీతెలియక అలా ఫ్రీలర్‌ వదులుతున్నది. అది వెంటనే బెడిసికొడుతున్నది. ఆ వెంటనే సర్కార్ తగ్గుతున్నది. ఆ లోపు నవ్వల పాలవుతున్నది. సరే, గతంలో కేసీఆర్‌ సర్కార్‌కు చెప్పేవాడు లేడు.. కేసీఆర్‌ వినేది లేకుండె. ఇప్పుడలా లేదు. కనీసం రేవంత్‌ సర్కార్‌ దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాడు. తప్పును చక్కిదిద్దేందుకు వెనక్కి రావడం లేదు.

అంత వరకు ఓకే. కానీ, ఈ గ్యాప్‌ కూడా రాకుండా చూసుకుంటే బెటరేమో అనే అభిప్రాయాలు వస్తున్నాయి. సర్వీస్‌ పెన్షన్‌ తీసుకుంటూ ఆసరా కూడా తీసుకుంటున్న పండుటాకుల వద్ద నుంచి పెన్షన్‌ రివకరీ ప్రయోగం చేసి దెబ్బతిన్నాడు రేవంత్‌రెడ్డి. వెంటనే ఈ డ్యామేజీని కవర్ చేసేందుకు ఇప్పడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు… మార్గదర్శకాలు రూపొందిస్తున్నామన్నారు. రైతు రుణమాఫీపై రేషన్‌ కార్డు నిబంధన పెట్టారు. అర్హులైన రైతులకే ఇవ్వాలనే ఉద్దేశ్యాన్ని జనం గ్రహిస్తారని భావించి ఉంటారు. కానీ ఇదీ తిరగబడింది. రేషన్‌ కార్డు లేని వారు రైతులు కారా, వాళ్లు వ్యవసాయం చేయడం లేదా..? గత ప్రభుత్వం వీరిని రైతులుగా గుర్తిస్తే, ఈ ప్రభుత్వం ఎందుకు రైతులుగా గుర్తించడం లేదనే పోలికను తీసుకొచ్చారు. ఇదీ ఎదురుతన్నింది.

అప్పటికప్పుడు నష్టనివారణ కోసం రేషన్‌ కార్డు క్రైటేరియా కేవలం కుటుంబం ఒకరికి ఇచ్చేందుకు ప్రామాణికం కోసమేనని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ అమలు అదే జరగనుంది. తొలత రేషన్‌కార్డు ఉన్నవారందరికీ విడతల వారీగా రెండు లక్షల రుణమాఫీ చేసేలా సర్కార్‌ ప్లాన్‌ చేస్తున్నది. ఈ ప్రక్రియ మాటిచ్చినట్టుగా పంద్రాగస్టు లోపు జరిగిపోతుంది. ఇక ఆ తరువాత మిగిలిన వారి సంగతి చూద్దామని దీన్ని లైట్‌ తీసుకుంటున్నారు. పైకి మాత్రం ఆ షరతు నిబంధనను తప్పించేశారు. ఇక నిరుద్యోగుల విషయంలోనూ రేవంత్‌ మాట్లాడిన కొన్ని మాటలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి.

ఆందోళనలు చేస్తున్న వారెవరూ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోలేదని వెటకారంగా మాట్లాడటం కూడా నిరుద్యోగులను మరింత రెచ్చగొట్టినట్టే అయింది. ఉద్యమాలు చేయాలంటే, ఆందోళనకు దిగాలంటే నిరుద్యోగులే అయి ఉండాలా..? చేసే వారంతా అభ్యర్థులే ఉండాలా..? ఈ విషయంలో సంయమనంతో సీఎం మాట్లాడాల్సింది. ఇక రైతు భరోసా విషయంలో కూడా ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఐదెకరాల సీలింగ్‌ విధించనుంది. ఇదీ రచ్చ రాజకీయానికే తెరతీయనుంది. మరి దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు గానీ, దిద్దుబాటు మాటలు ఏం చెబుతారో చూడాలి.

You missed