(దండుగుల శ్రీనివాస్ )
కేసీఆర్ నేలకుదిగొచ్చాడు. నేల విడిచి సాము చేసిన కేసీఆర్‌కు ప్రజాతీర్పు నేల మీదకు తెచ్చింది. ఫామ్ హౌజ్ రాజకీయాల నుంచి ప్రజాక్షేత్రం వైపు నడిపించే దిశగా అడుగులు వేస్తున్నాడు కేసీఆర్ . తప్పుదు మరి. పరిస్థితులు అలా వచ్చాయి. ఇలాంటి రోజులు వస్తాయని బహుశా కేసీఆర్ ఊహించి ఉండడు. మొన్నటి అసెంబ్లీ సమాశాలకు కేసీఆర్ వస్తాడా…? అనే ప్రశ్నలకు బీఆరెస్ నేతలు ఇచ్చిన తల బిరుసు సమాధానం జనాలకు నచ్చలేదు. కేసీఆర్‌కు తెలుసు ఎప్పుడు రావాలో అని ఒకరంటే.. కేసీఆర్ వస్తే మీ సంగతి ఎలా ఉంటుందో తెలుసు కదా అని ఒకరు వెకిలి ఆన్సర్ ఇచ్చారు. ప్రజాతీర్పుకు శిరసావహించి అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే.
పదేండ్లు సీఎం అయినంత మాత్రాన అదే బింకం, దర్పం, అహంకారం చూపాలా..? చూపితే ఇక పుట్టగతులుండవని తెలుసుకున్నట్టున్నాడు. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టగానే వచ్చి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడాడు. ఏదో ఒకటి మాట్లాడాలె కాబట్టి మాట్లాడినట్టే ఉంది. కేసీఆర్‌కేమీ తీసిపోలేదు రేవంత్‌రెడ్డి. మసిపూసి మారేడు కాయ చేసినట్టు అంకెల గారడీ చేయడంలో నీ బాటనే మేము అన్నట్టుగానే బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరేం మాట్లాడాలి..? రైతు సంక్షేమం పట్టలేదన్నాడు. కానీ వ్యవసాయానికే ఎక్కువ నిధులు కేటాయించారు. తప్పదు కేటాయించాల్సిందే. ఎందుకంటే అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు రేవంత్ రైతుల చలవ తోనే అధికారంలోకి వచ్చింది. బడ్జెట్ ఒట్టి కథలు, కషానీలు అంటూ అవే ఫ్రష్టేషన్ మాటలే మాట్లాడాడు.
అప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇవే అంకెల కషానీలే కదా. జనాలకన్నీ తెలుసు. రైతు బంధు ఎగ్గొట్టాడానికే అన్నాడు. బడాబాబులకు, పెద్ద పెద్ద పెత్తందార్ల భూములకూ రైతుబంధు ఇచ్చి వారంతా రైతులే కదా అని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది కేసీఆర్. ఇప్పుడు దాన్ని తగ్గించుకునేపని చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్. అవును.. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వందల ఎకరాల ఆసాములకు రైతుబంధు అవసరమా..? తీసేస్తే ఎక్కడ వ్యతిరేకత వచ్చి ఓట్లు పడవో అనే భయంతోనే కేసీఆర్ ఇలాంటి పనికి మాలిన చర్యలకు పాల్పడింది. దళితబంధు అన్నాడు.
ఎవరి కోసం దళితబంధు…? బీఆరెస్ పార్టీ పెట్టుకుని దేశంలో చక్రంతిప్పే కలలుకన్న కేసీఆర్.. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు గొప్పలు చెప్పుకునేందుకు ప్రవేశపెట్టిన పథకమే దళితబంధు. దీన్ని నాయకులు పంచుకుని వాటాలేసుకునేందుకు ఉపయోగించుకున్నారు. సరే, ఈ బడ్జెట్‌తో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదు. అక్కడ ఖజానా పరిస్థితి ఆశాజనంకంగా కూడా ఏమీ లేదు. కేసీఆర్ చేసిన పాపాల భారం ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మోస్తున్నది. కానీ ఎక్కడా తగ్గొద్దు కదా అందుకే తగ్గేదేలేదని ఇలా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి మాయ మాటలు, అంకెల గారడీలు చేస్తున్నారు. కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ సర్కారూ నడుస్తున్నది. తప్పుదు. చాలా విషయాల్లో అలా నడిచేలా చేశాడు మరి. ఇప్పుడు ప్రజాతీర్పు శిక్షననుభవిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు పరాకాయ ప్రవేశం చేస్తున్నాడు. మంచిదే.