Dandugula Srinivas
Senior Reporter
(8096677451)
ఆరు గ్యారెంటీలతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ సర్కార్.. మొట్టమొదటిగా అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమే. ఈ పథకం పేద, మధ్యతరగతి మహిళలకు ఎంతో బాసటగా నిలిచింది. ఆర్థికంగా ఆయా కుటుంబాలకు కొంతలో కొంత భారాన్నీ తగ్గించింది. కానీ ఈ స్కీమ్ ఆది నుంచే అమలులో మహిళలకు ఇబ్బందులను తెచ్చి పెడుతూనే ఉంది. ప్రభుత్వం సైడ్ నుంచి తగినన్ని బస్సుల సౌకర్యం ప్రధాన లోపంగా మారింది. పథకం అమలు చేశారు. వదిలేశారు. మళ్లీ దీనిపై రివ్యూ లేదు. అమలు తీరుపై ఆరా లేదు. తగినన్ని బస్సులు పెంచే ఆలోచనా లేదు. పెంచాలంటే ఆర్థిక భారమూ ఆటంకమే. సరే ఇవన్నీ ఒకత్తయితే.. స్టాఫ్‌లో మహిళలంటే చిన్నచూపు ఏర్పడేలా చేసిందీ పథకం. అందరినీ తప్పుబట్టడం కాదు ఉద్దేశం.ప్రధానంగా జనంతో కలిసి ప్రయాణం చేసేది డ్రైవర్, కండక్టర్. ఇంకా ప్రయాణీకలకు దగ్గరగా ఉండేది కండక్టర్. ఆ కండక్టర్ల వ్యవహారశైలిలో కొంత మార్పు వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తామన్న మార్పేమోగానీ, ఈ పథకం అమలు విషయంలో మాత్రం కొంత మంది కండక్టర్లు, డ్రైవర్ల ప్రవర్తన మహిళలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఫ్రీగా ప్రయాణిస్తున్నారు కదాని మరీ చీప్‌గా చూడటం అలవాటు చేసుకున్నట్టుంది ఆర్టీసీ స్టాఫ్. చాలా సందర్బాల్లో మహిళలకు ఈ విషయంలో చేదు అనుభవాలు, మర్యాద, గౌరవం ఇచ్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఫిర్యాదులు చేయడం లేదు. అందుకే ఇవి బయటకు రావడం లేదు. తాజాగా ఫరూఖ్‌నగర్ డిపోకు చెందిన కండక్టర్ ఓ ప్రయాణికురాలిపై అనుచితంగా ప్రవర్తించడం, ఆమె ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. విచారణ చేసిన అధికారులు కండక్టర్ తప్పిదం తెలుసుకుని అరెస్టు , రిమాండ్‌తో సరిపెట్టారు.
కానీ ఇది లోలోల మరీ వేళ్లూనుకుని పోయింది. పల్లె వెలుగు నుంచి మొదలుకొని ఎక్స్‌ప్రెస్‌ల వరకు చాలా చోట్ల ఇలాంటి చేదు అనుభవాలను భరిస్తూ వెళ్తున్నారు మహిళా ప్రయాణికులు. ఫ్రీ బస్సు కదా అని పనీపాట లేని వారంతా బస్సు ఎక్కుతున్నారనే ప్రచారం ఓసారి, అవసరం లేకున్నా అనవసర ప్రయాణం చేస్తున్నారని మరోసారి ట్రోలింగ్‌లు చేస్తూ కొంత మంది మహిళలను కించపరుస్తూ వచ్చారు. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉచిత బస్సు ప్రయాణంతో దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇందులో ఆంతర్యమేమిటో.. అంతకు ముందు మహిళలు దైవదర్శనాలే చేయలేదా..? ఈ స్కీమ్ ఉద్దేశం లాభనష్టాలతో ముడిపెట్టబడింది కాదు. మహిళలకు ఆర్థికంగా ఎంతో కొంత బాసటగా ఉండేందుకు.
లాభాలతో దీనికి లింకు పెట్టి చూసే స్కీం కాదు. అలా అంటే ఏ స్కీమ్ కూడా ప్రభుత్వానికి లాభం తెచ్చిపెట్టేది కాదు. కొంత మంది డ్రైవర్లు బస్ స్టాప్‌ల దగ్గర ఆపకుండా కూడా తీసుకెళ్తున్నారు. కారణం బస్సు ఫుల్‌గా ఉందని. మహిళలు మొత్తం ఆర్టీసీని ముంచడానికే బస్సు ఎక్కుతున్నారనే ఫీలింగ్‌ను వదిలి , వారితో మర్యాదగా మసలుకుంటేనే సర్కార్‌కు చెడ్డపేరు రాదు. ఈ విషయంలో సర్కార్ ప్రత్యేక శ్రద్ద తీసుకోకపోతే ఆరు గ్యారెంటీల్లో మొదటి పథకమే నెగిటివ్‌గా మారే ప్రమాదం లేకపోలేదు.