.దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం బ్యూరో చీఫ్‌: ‘పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌… పీఆర్వోలంటే ఇట్లనే ఉంటరా..? ఏదో ఓ ప్రెస్‌నోట్‌ రాయడం.. పేపర్లో వచ్చిన వార్తలను మా ముఖాన కొట్టడంతో మీ పనైపోయిందనుకుంటున్నారా…? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నది…? జనాలేమనుకుంటున్నారు..? ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటూ మీరిచ్చే ఫీడ్‌ బ్యాక్‌ ఏదీ..? ఇలాగైతే కష్టం.. పద్దతి మార్చుకోండి. గత ప్రభుత్వంలో నడిచనట్టే ఇక్కడా నడవాలంటే కుదరదు…’ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రుల పీఆర్వోలకు క్లాస్‌ పీకాడు.

మంత్రుల వద్ద ఉన్న పీఆర్వోలపై సీఎంకు ఫిర్యాదులందాయి. వారి పనితీరుపైనా ఆరా తీసిన సీఎం… ఇదే అంశంపై పీఆర్వోలకు క్లాస్‌ తీసుకున్నాడు. బీఆరెస్‌లో కూడా ఇలాగే పీఆర్వోల రాజ్యం నడిచింది. చేయాల్సిన పని చేయకుండా షాడో మంత్రుల్లా వ్యవహరించారు. తగుదునమ్మా అంటూ ఏవేవో సంబంధం లేని విషయాల్లో, పంచాయితీల్లో జోక్యం చేసుకుని రచ్చకెక్కారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా సేమ్‌ అలాగే నడుస్తున్నది.

ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సీఎం రేవంత్‌.. వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పద్దతి మార్చుకోకపోతే వారిని మార్చడం ఖాయమనే సంకేతాలిచ్చాడు. ఇప్పుడు ఇదే టాపిక్‌ హైదరాబాద్‌ మీడియా సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నది. ఓ మహిళా మంత్రి పీఆర్వో అయితే ఏకంగా డీఆర్‌డీఓ ను జిల్లా రెవెన్యూ డివిజన్‌ అధికారిగా పేర్కొంటూ ప్రెస్‌నోట్‌ రిలీజ్ చేశాడు. ఇది కూడా మీడియాలో చర్చకు వచ్చింది.

You missed