నైజం..!
(కేసీఆర్ మరోకోణం)
ధారావాహిక-7
………………………………….
వ్యూహాలు రచించడంలో కేసీఆర్‌కు మరొకరు సాటిలేరు..
ఎప్పటికప్పుడు పరిస్థితులకనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అందరి సలహాలు తీసుకున్నట్టే కనిపిస్తాడు. కానీ ఎవరి మాట వినడు. తనకు తోచింది చేస్తాడు. అవి అన్ని వేళలా సత్పలితాలివ్వవు. బెడిసికొడుతూ ఉంటాయి. కానీ దానికి తను బాధ్యత తీసుకోడు. పరనింద చేస్తాడు. ప్రజలను దోషులుగా నిలబెడతాడు. అంతేగానీ తన మూర్ఖపు ఆలోచనల కింద జమకట్టాడు. ఎందుకంటే తనో మేధావి. అంతే తనను మించిన రాజకీయవేత్త లేడు. తన మేథాశక్తికి మించి మరెవ్వరూ సాటిరారు. తన వ్యూహాలు ఎవరికీ అందవు. అదీ కేసీఆర్‌లోని సుపిరియారిటీ కాంప్లెక్స్. అహంకారానికి పరాకాష్ట.
2009లో ఇదే జరిగింది.
మళ్లీ పార్టీని లేపాలి. ఎలా…?
కాంగ్రెస్ దోస్తానా చెడింది. ఇప్పుడు ఎవరితో కలిసి వెళ్లాలి. ఒంటరిగా పోటీ చేసే సీన్‌లేదు. ప్రజల్లో అంత బలం లేదు. పార్టీలోనూ అంతగా బలం లేదు. ఆర్థికంగా అంతంత మాత్రమే. మరి….
చంద్రబాబుతో దోస్తానా కడితే..
సమైక్యవాది బాబుతో కలిసి పోతే చరిత్ర హీనుడనరా..?
ప్రజలకు అంత సీన్ ఉందా..? అంత తెలివి ఉందా..? తనేం అనుకుంటే అది.. తనేం చేస్తే అది ఈ గొర్రె జనాలు తలలూపాల్సిందే కదా..
అంతే వ్యూహం రచించాడు. చంద్రబాబుతో పొత్తు. మహాకూటమి అంటు దానికోపేరు.
బాబు కూడా సేమ్ కేసీఆర్‌లాగే ఆలోచించాడు. ఇద్దరు మేకవన్నె పులులు. గోతికాడి నక్కలు. అప్పటి అవసరాలు అలా ఉన్నాయి ఇద్దరికీ.
అందుకే జతకట్టారు. మరి జత కట్టేముందు తెలంగాణ జనాలను గొర్రెలను చేయాలె కదా. అందుకే బాబుతో ‘జై తెలంగాణ’ అనిపించాడు.
చూశారా…! కరుడుగట్టిన సమైక్యవాది చంద్రబాబుతో కూడా కేసీఆర్ జై తెలంగాణ అనిపించాడు.. అని జనాల్లోకి ఫీలర్ వదిలాడు కేసీఆర్..
ఔ.. ఔ… కేసీఆర్ గ్రేట్.. జై కేసీఆర్.. జైజై తెలంగాణ అనిపించాడు. కానీ జనాల గుండెలకు తాకలేదు సరికదా భగ్గుమనిపించింది.
అది గుర్తించలేదు కేసీఆర్.
అక్కడ బాబు పరిస్థితి కూడా అంతే. అదేందీ… పార్టీ మనుగడ కోసం సీట్ల కోసం తెలంగాణవాది కేసీఆర్‌తో జతకడతాడా..?
కేసీఆర్ మనకవసరమా..? అని ఆంద్రోళ్లు కూడా బాబు వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు సిద్దపడ్డారు.
ఫలితాలు ఇద్దరికీ కర్రుకాల్చి వాత పెట్టేలా వచ్చాయి.
టీఆరెస్‌కు 36 సీట్లిస్తే అందులో గెలిచింది తొమ్మిదే. కేసీఆర్ కూడా మహబూబ్‌నగర్ నుంచి పదివేల ఓట్లలోపు మెజార్టీతోనే బతికి బయటపడ్డాడు. విజయశాంతిదీ అదే పరిస్థితి.. అంతలా ప్రజాగ్రహం పెల్లుబెకింది.
అంతకు ముందు కాంగ్రెస్‌తో జతకట్టినప్పుడు జనాలు కొంతలో కొంత యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు సానుకూలంగా మాట్లాడింది కాబట్టి. కానీ బాబు అవకాశవాది. ఎన్ని మాటలు చెప్పినా తెలంగాణ జనం వినలేదు. దెబ్బకొట్టారు. ఇద్దరికీ వాచిపోయింది.
మళ్లీ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
ఇక కేసీఆర్‌కు నూకలు చెల్లాయనుకున్నారంతా…
హరీశ్‌రావు కూడా వన్‌ఫైన్ మార్నింగ్ రాజశేఖర్‌రెడ్డిని కలిశాడు.
ఖేల్‌ఖతం అనుకున్నారంతా..!!
ఆట ఇక అప్పుడే మొదలైంది…
(ఇంకా ఉంది)
to be continued….
Dandugula Srinivas
Senior Journalist
8096677451