నైజం..!

(కేసీఆర్‌ మరోకోణం)

ధారావాహిక-4

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం..!

కేసీఆర్‌ రాజీనామా..! కేంద్ర మంత్రి పదవికి. కరీంనగర్‌ ఎంపీ పదవికి. అంతే మళ్లీ కేసీఆర్‌ పేరు హాట్‌ టాపిక్‌గా మారింది. అప్పటి వరకు ఇక అయిపోయిందిరా కేసీఆర్‌ పని అనుకున్న వాళ్లంతా మళ్లా కేసీఆర్‌ నామం జపించడం మొదలుపెట్టారు. రాజకీయాలన్నీ ఆయన వైపే చూస్తున్నాయి. ఉప ఎన్నిక రానే వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్‌ను ఈ రాజీనామాతో రాజేసిండు కేసీఆర్‌. ఉద్యమ స్పూర్తి రగిలించింది. టీఆరెస్‌ పార్టీకే కాదు అందరికీ ఇది సవాల్‌గా మారింది. అలా పరిస్థితిని క్రియేట్‌ చేయడంలో కేసీఆర్‌ సక్సెసయ్యాడు.

ఇది నా గెలుపు కాదు తెలంగాణ గెలుపు. ఒకవేళ నేను ఓడిపోతే తెలంగాణ ఓడినట్టే. ఆంధ్ర శక్తుల మధ్య మనం కట్టు బానిసలుగా ఉండాల్సిందే. ఇవే సంకేతాలిచ్చాడు కేసీఆర్‌. దీంతో సబ్బండవర్ణాలు ఏకమయ్యాయి. కాంగ్రెస్‌, బీజేపీ.. అందరూ పార్టీలకతీతంగా ఏకమయ్యారు. స్వచ్చంధంగా కేసీఆర్‌ గెలుపు కోసం పనిచేశారు. కదం కదం కలిపారు. అక్కడ కేసీఆర్‌ను చూడలేదు. ఒక్క తెలంగాణ వాదమే పనిచేసింది. అదే ఆ సమయంలో కేసీఆర్‌కు శ్రీరామ రక్షగా నిలిచింది.

కేసీఆర్‌ అంటూ ఉంటాడు కదా. ‘ అటుకులు బుక్కినమో… అర్ధాకలితో ఉన్నమో.. పేగులు తెగేదాక కొట్లాడినం… తెలంగాణ సాధించినం..’ అని. కానీ అది కేసీఆర్‌ కు యాప్ట్‌ కాదు. తెలంగాణ వాదులకు, సబ్బండవర్ణాలకు యాప్ట్‌ అవుతుంది. అవును.. అలా పోరాడారు, ప్రచారం చేశారు అన్ని వర్గాలు. కేసీఆర్‌ను గెలిపించుకోవాలి. ఢిల్లీకి గట్టి సంకేతాలు పంపాలి. లేదంటే ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాటు అనేదే అసాధ్యం. మరిచిపోవాల్సిందే. అందుకే అంతా కృతనిశ్చయంతో ముందుకు కదలారు. కవులు, కళాకారులు, జర్నలిస్టులు, ఉద్యోగసంఘాలు, కుల సంఘాలు.. అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. అప్పటి వరకు వివిధ అభిప్రాయాలో భిన్న అభిరుచులు, లక్ష్యాలు ఉన్న వారంతా ఇప్పుడు ఏకైక లక్ష్యంతో నడుం బిగించారు.

అదే కేసీఆర్‌ను గెలిపించాలి.

టీఆరెస్‌ను గెలిపించాలి.

ఢిల్లీ పీఠం అదరాలి.

రాజశేఖర్‌రెడ్డి లాంటి సమైక్యవాదులకు గట్టి గుణపాఠం చెప్పాలి.

అదే జరిగింది.

కేసీఆర్‌కు చిన్నపాటి విజయాన్నివ్వలేదు.

రెండు లక్షల భారీ మెజార్టీతో కేసీఆర్‌ను గెలిపించుకున్నారు తెలంగాణ వాదులు. అదీ ఆంద్ర శక్తుల నడుమ. రాజశేఖర్‌రెడ్డి లాంటి భయంకర కాలనాగు వెదజల్లిన విషకోరలను దాటుకొని..

మళ్లీ టీఆరెస్‌లో ఊపు వచ్చింది. కొత్త ఉత్తేజం నిండుకున్నది. కారణం కేసీఆర్.

తెలంగాణ సెంటిమెంట్‌ బతికే ఉందని చెప్పాడు. అది తనకు , తన పార్టీ మేలుకు ఉపయోగించుకున్నాడు.

ప్రజలంతా తన కోసం పనిచేసేలా చేసుకోవడంలో తన కుయుక్తులు ఇక్కడ ఫలించాయి.

పార్టీ బతికితేనే తెలంగాణ బతికినట్టు. లేదంటే మీరంతా సచ్చినట్టు అనే అభిప్రాయాన్ని కలిగించగలిగాడు కేసీఆర్‌. అదే మానియాలో ఉన్నారప్పుడు జనాలంతా.

కానీ రాజశేఖర్‌రెడ్డి వదల్లేదు. వెంటాడుతూనే ఉన్నాడు.

ఆంధ్ర, తెలంగాణ మధ్య అనధికారిక విభజన ఏర్పడింది. ప్రాంతాల వారీగా మరింత గ్యాప్‌ వచ్చింది.

కేసీఆర్‌ ఇక ఇదే మంచి తరుణమనుకున్నాడు.

ఢిల్లీ మెడలు వంచాలంటే తన కుయుక్తిని మరోసారి ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాడు.

కేసీఆర్‌కు తెలిసిన ఒకే ఒక్క ఫార్మూలా.

కష్టకాలంలో తనను, పార్టీని ఒడ్డెక్కించే ఫార్మూలా.

అదే రాజీనామా అస్త్రం..!

కానీ అప్పుడు తెలియదు కేసీఆర్‌కు. ఇది ఈసారి బూమరాంగ్‌ కానుందని.

(ఇంకా ఉంది)

 

Dandugula Srinivas

Senior Journalist

8096677451

 

 

You missed