నైజం..!
(కేసీఆర్ మరో కోణం)
ధారావాహిక-౩
అది 2004 ఎన్నికల సమయం..
కేసీఆర్ అప్పటికే దేశంలోని అన్ని పార్టీల నేతలను కలవడం ప్రారంభించాడు. తెలంగాణకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సోనియాగాంధీనీ కలిశాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి వివరించాడు. అప్పటికే ఉమ్మడి ఏపీలో చంద్రబాబు చాలా స్ట్రాంగ్ లీడర్. బాబును కొట్టాలంటే తనతో ఒక్కడితో కాదని కేసీఆర్ గ్రహించేశాడు. రాజకీయంగా టీఆరెస్‌ను బలోపేతం చేస్తే తమ గళం వినేవాడు లేడని తెలుసు. అందుకే సోనియా చెంతకు వెళ్లాడు. సోనియా కూడా అప్పటి పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కామన్ మినిమన్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని పెడతానని మాటిచ్చింది.
ఇక్కడ రాజశేఖర్‌రెడ్డి కూడా సోనియా మాటను కాదనలేకపోయాడు. కేసీఆర్‌పై రాజశేఖర్‌రెడ్డికి నమ్మకం లేదు. అప్పటి అవసరాలు అలా ఉన్నాయి ఇద్దరికీ. మొత్తానికి 2014 ఎన్నికలకు కాంగ్రెస్, టీఆరెస్ పొత్తుతో కలిసి వెళ్లాయి. టీఆరెస్‌కు 36 సీట్లకు 26 సీట్లు గెలుచుకున్నది. కాంగ్రెస్‌కు 170 దాకా వచ్చాయి. కేసీఆర్‌తో రాజశేఖర్‌రెడ్డికి పని పడలేదు. అవసరం లేకుండా పోయింది. ఇక కేసీఆర్‌ను పట్టించుకోలేదు. ఆరుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఐదుగురు ఎంపీలు గెలిచారు. కేసీఆర్‌కు కేంద్ర మంత్రి పదవి వచ్చింది.
అప్పటి వరకు ఓ మాట. ఆ తరువాత ఓ మాట. కాంగ్రెస్ నైజం ఇదే. ఇప్పుడూ అలాగే ప్రవర్తించింది. తెలంగాణను, కేసీఆర్‌ను పక్కన పెట్టేసింది. రాజశేఖర్ రెడ్డి తనలోని కన్నింగ్ లీడర్‌ను బయటకు తీశాడు. కేసీఆర్‌ను, టీఆరెస్‌ను లేవనీయకుండా గట్టి దెబ్బకొట్టాలె. ఎలా..?
సమయం కూడా వేచి చూస్తున్నాడు గుంటనక్కలాగ.
ఒక్కొక్కరినీ కొంటే కాదు.. టోకున ఒకేసారి పది మందికి గాలం వేయాలి..? ఎలా..?
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను ఓ పావులా వాడుకున్నాడు రాజశేఖర్‌రెడ్డి.
కాసానికి రాజ్యసభ కావాలి.
ఇస్తానన్నాడు రాజశేఖర్‌రెడ్డి. కానీ ఒక షరతు.
టీఆరెస్ పది మంది ఎమ్మెల్యేలకు గాలం వేయాలి. కొనాలి. ఒక్కొక్కరికీ కోటి ఇవ్వాలి.
డీల్ ఓకే అయ్యింది.
ఓ రోజు ముహూర్తం చూసి గట్టి దెబ్బ కొట్టాడు రాజశేఖర్‌రెడ్డి.
పది మంది ఎమ్మెల్యేలు టీఆరెస్ నుంచి ఔట్..
కేసీఆర్ కోలుకోలేని దెబ్బ..
ఎంపీలు పార్టీ మారలేదు. ఐదుగురు అలాగే ఉన్నారు. టీఆరెస్ బలం 26 నుంచి 16కు పడిపోయింది.
తెలంగాణ విషయంలో సోనియా స్టాండ్ మార్చింది. చేతులెత్తేసింది. మెల్లగా టీఆరెస్ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది.
‘తెలంగాణకు నేను అడ్డమూ కాదు పొడవూ కాదు..’
రాజశేఖర్‌రెడ్డి వెటకారం కేసీఆర్ పుండుమీద కారం చల్లింది.
‘చీమల పుట్టలో పాములు జొరబడ్డాయ్…!’
మినిష్టర్ సత్యనారాయణ మరింత హేళన చేశాడు. తమ వల్లే టీఆరెస్‌కు అంతో ఇంతో ముఖం తెలివి ఉందని, లేదంటే దానికంత సీన్ లేదన్నాడు. రెచ్చగొట్టాడు.
తిక్కరేగుతోంది కేసీఆర్‌కు. ఏం చేయాలి…?
ఒకటే ఆలోచన…
రాజీనామా చేయాలి…!
(ఇంకా ఉంది)
Dandugula Srinivas
Senior Journalist
8096677451