తెలంగాణ కోసం అప్పటికే చెన్నారెడ్డి పార్టీ పెట్టి 11 మంది ఎంపీలను గెలిపించుకున్నా.. ఇందిరాగాంధీ చెన్నారెడ్డిని కొనేసింది.తెలంగాణ ఉద్యమం, సెంటిమెంట్‌ పట్ల నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో ఇంకా బలంగా ఉంది. దీంతో తెలంగాణ గురించి బలంగా కొట్లాడే పార్టీ ఒకటి లేకుండా పోయిందిక్కడ. కొండా లక్ష్మణ్‌ బాపూజీ అప్పటికే ఏకాకయ్యాడు. కేసీఆర్‌ను కలిశాడు. ఆర్థికంగా కేసీఆర్‌కు చేయూతనిచ్చాడు. కేసీఆర్‌ కు ఇక్కడ యాంటీ చంద్రబాబు వర్గం తోడయ్యింది. తెలివిగా కేసీఆర్‌ వారినే టార్గెట్‌ చేశాడు.

ఎన్టీఆర్‌ చనిపోయిన తరువాత చంద్రబాబు ను వ్యతిరేకిస్తూ లక్ష్మీపార్వతి చెంత చేరిన లీడర్లందరినీ టచ్ చేశాడు కేసీఆర్‌. ఎలాగూ వారందరికీ ఏ ఆదెరువూ లేదు. లక్ష్మీపార్వతితో ఉన్నా రాజకీయంగా వారంతా ఎదగలేని పరిస్థితి. వారికి గాలం వేశాడు కేసీఆర్. చంద్రబాబు యాంటీ టీమ్‌ను మొత్తం తెలంగాణ ఉద్యమం పేరుతో తన వైపు తిప్పుకున్నాడు. వారంతా కేసీఆర్‌ మాటలకు, ఆయనలోని విషయ పరిజ్ఞానికి, తెలంగాణ మీద ఉన్న సోయికి ఫిదా అయ్యారు. చమత్కారంగా మాట్లాడి బుట్టలో వేసుకోవడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. సమయానుకూలంగా, సందర్బోచితంగా తనకు కావాల్సింది చేయడం, ఎదగడం ఆయనకు అప్పటి నుంచే అలవాటు.

ఇలా అందరినీ పోగేసిన కేసీఆర్‌ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశాడు. తొలి మీటింగ్‌ కరీంనగర్‌.

డబ్బులెలా..?

గ్రాండ్‌గా మీటింగ్‌ నిర్వహించాలె. ఎలా..?

ఎవరిని అడగాలె.

మొయినాబాద్‌లోని తన పదెకరాల తోటను అమ్మేశాడు కేసీఆర్‌.

70లక్షలొచ్చినయి. ఆ పైసలన్నీ తీసుకొచ్చి మీటింగుకే పెట్టాడు. మీటింగ్‌ గ్రాండ్‌ సక్సెస్‌. నభూతో నభవిష్యత్‌ అనే రేంజ్లో మీటింగ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు కేసీఆర్‌. తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉద్యమానికి మళ్లీ ఊపునిచ్చింది.. కొత్త ఉత్సాహాన్నిచ్చిందా మీటింగ్‌.

2001 ఏప్రిల్‌లో పార్టీని ఏర్పాటు చేస్తే.. మెల్లమెల్లగా బలం పుంజుకుంటూ వస్తోంది టీఆరెస్‌. అదే ఏడాది జూలైలో లోకల్‌బాడీ ఎన్నికలు.

నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 36 జడ్పీటీసీ స్థానాలకు టీఆరెస్‌ 19 గెలుచుకున్నది. జిల్లా పరిషత్‌ పై టీఆరెస్‌ జెండా ఎగిరింది. చైర్మన్‌గా సంతోష్‌రెడ్డిని నియమించాడు కేసీఆర్. ఆ తరువాత కరీంనగర్‌లో అంత బలం లేకున్నా బీజేపీ సపోర్టుతో అక్కడ రాజేశ్వర్‌ రావు జడ్పీ చైర్మన్‌ అయ్యాడు. టీఆరెస్‌ బోణీ కొట్టింది. కేసీఆర్‌లో ఉత్సాహం పెరిగింది. తన మీదతనకు నమ్మకం మరింత పెరిగింది. ఇక తిరుగులేదనుకున్నాడు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ మేథావులతో మమేకమవుతూ వస్తున్నాడు. జయశంకర్‌సార్, కోడండరామ్‌, గాదె ఇన్నయ్య, వీ ప్రకాశ్‌, నర్సింహారెడ్డి, మధుసూదనచారి, విద్యాసాగర్‌ రావు .. ఇలా అందరితో చర్చోపచర్చలు, సుధీర్ఘ మంతనాలు నడుస్తున్నాయి.

నందినగర్‌లో ఫస్ట్‌ ఫ్లోర్‌ కంప్లీట్ అయ్యింది. మీటింగు కోసం హాలు సిద్దమయ్యింది. ఇక సమావేశాలకు కొదవలేదు. జన జాతర పెరుగుతూ వస్తోంది.

మీటింగులకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేసుకున్నాడు కేసీఆర్. ఇక ఆగేదే లేదనే రేంజ్‌లో దూకుడుగా పోతున్నాడు. సర్పంచులనూ గణనీయంగా గెలిపించుకోగలిగింది గులాబీ పార్టీ.

నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తప్ప టీఆరెస్‌ మెల్లగా విస్తరిస్తూ పోతున్నది.

కానీ అప్పటికీ..

కేటీఆర్‌, కవిత.. ఎవరో ఎవరికీ తెలియదు.

వారెక్కడున్నారో కూడా టీఆరెస్‌ లీడర్లకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరమూ వారికి రాలేదు.

(ఇంకా ఉంది)

Dandugula Srinivas

Senior Journalist

8096677451

 

You missed