నైజం

(కేసీఆర్‌ మరో కోణం..)

ధారావాహిక-1

 

కేసీఆర్‌ గురించి ఎందరికో తెలియని కోణం టచ్‌ చేయాలనే ఆలోచన నాకుండేది. కేసీఆర్‌తో పార్టీ ఆవిర్భావం నుంచి అత్యంత సన్నిహితంగా , చాలా దగ్గరగా మెసిలిన ఓ సీనియర్‌ నేత (పేరు రాయడానికి ఇష్టపడలేదు)ను చాలా సార్లు కలిసినప్పుడు తన మనసులోని మాట చెప్పేవాడు. ఉన్నదున్నట్టుగా కేసీఆర్‌ నైజం గురించి, ఆయన మెంటాలిటీ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాడిలా మాట్లాడేవాడు. నేను చాలా ఇంట్రస్ట్‌గా వింటూ ఉండేవాడిని. చాలా సందర్భాల్లో కేసీఆర్‌ను రాక్షసుడని ఇంకా పరుషంగానే సంబోధించేవాడు. తిట్టేవాడు. శాపనార్ధాలు పెట్టేవాడు. బాధపడేవాడు. ప్రస్తుత పార్టీ పరిస్థితి చూసి కన్నీటి పర్యంతమయ్యేవాడు.

కేసీఆర్‌తో సోపతి చేసి, పార్టీకి సేవ చేసి దాదాపు యాభై అరవై కోట్ల తన ఆస్తిని హారతి కర్పూరం చేసుకున్నానని గుర్తు చేసుకుని బాధపడతాడాయన. తనకు ఆరోగ్యం క్షీణించడం కారణమూ పార్టీ సేవ, కేసీఆర్‌ మాట వినడమేనని, అయినా తన పట్ల ఒక్కసారి కూడా కేసీఆర్‌ దయచూపలేదని, వాడుకుని వదిలేయడంంలో, కిరాతంగా జీవితాలను గొంతు కోయడంలో, ఆడోళ్ల పుస్తెలు పుట్టుకున తెంపే పాపంలో సిద్దహస్తుడు కేసీఆర్‌ అని కూడా నిర్మొహమాటంగా తన కడుపులోని ఆవేదనను చెప్పుకొస్తాడాయన.

తనే కాదు. తనలాంటి వారెందరో కేసీఆర్‌ మాటలకు పడిపోయి.. ఏదో చేస్తాడనుకుని త్యాగాలు చేసి ఇళ్లూ, ఒళ్లూ గుల్ల చేసుకున్న బాపతు నాయకులెందరో ఉన్నారని పేర్లు కూడా చెప్పుకొస్తాడాయన.

చాలా రోజులు తరువాత  వారింటికి వెళ్లాను కలుద్దామని. అతనికి కేసీఆర్‌ పట్ల ఉన్న అంతరంగాన్ని ఆవిష్కరిద్దామని. నాకొక కోరిక. అంతా కేసీఆర్‌ అపర భగీరథుడు, దేవుడు, జాతిపిత, తెలంగాణ ప్రధాత..ఇంకేవో వర్ణిస్తూ ఉంటారు. కానీ సీనియర్‌ జర్నలిస్టుగా నాకు ఆయనలోని మరో కోణం టచ్‌ చేయాలనే కోరిక ఉండేది. నేను కేసీఆర్‌ను కలిసింది లేదు. ఎప్పుడో ఓసారి ఓ ప్రోగ్రంలో సీఎంగా ఉన్న సమయంలో మీడియా మిత్రులతో పాటు ఓసారి కలిశాను అంతే. కానీ ఆయన గురించి తెలుసుకున్నది ఎక్కువే. ఆయనకు దగ్గర ఉన్న వారి నుంచి తెలుసుకున్న విషయాలూ కూడా ఎక్కువే. కేసీఆర్‌ నైజం, మెంటాలిటీని నాకున్న అనుభవంతో కొంతలో కొంత నేను బేరీజు వేసుకునే వాడిని. అతనిలోని నియంత కోణం, తననెవరూ ప్రశ్నించవద్దనే గుణం, అంతా తాను చెప్పిందే వినాలనే అహంకారం, అధికారం కోసం వ్యవస్థలను భ్రష్టుపట్టేందుకు కూడా వెనుకాడని క్రిమినల్‌ ఆలోచనలు, దీనికంతటికీ తెలంగాణ అభివృద్ధి కోసమే, ఇదే రాజనీతిజ్ఞత అని కేసీఆర్‌ ,అతని అనుచరులు చెప్పుకునే కలర్‌ కోటింగ్‌, షుగర్ కోటెడ్ మాత్రల కనికట్టు మాటల్లో అంతరార్థం నాకు తెలిసేది.

ఓ రకంగా నేను కేసీఆర్‌లో మరో కోణం కోసం తండ్లాడింది కూడా నా ఈ ఆలోచనలో భాగమే కావొచ్చు. అందులో భాగంగానే ఎప్పుడు తన మనసులోని ఆవేదననను, ఆక్రంధనను, ఉన్నదున్నట్లుగా చెప్పుకుని ఆ సీనియర్ నేతతో కలిసి ఓ సీరియల్‌గా రాయాలనే కోరిక ఉండేది. ఓ రోజు దానికి బలం వచ్చింది. నేరుగా ఆయనను కలిసేందుకు  అతని ఇంటికి వెళ్లాను. వెళ్లేటప్పుడు తాను వస్తున్నాననే విషయాన్ని చెప్పాను. నా కోసం ఆయన ఆత్రుతుగా ఎదురుచూస్తున్నాడనిపించింది తరుచూ తను ఎక్కడి వరకు వచ్చానో తెలుసుకునే ప్రయత్నం చేయడాన్ని బట్టి.

నా కోసమే హాళ్లో ఎదురుచూస్తూ సోఫాలో కూర్చుని ఉన్నాడా పెద్దమనిషి. కళ్లు పీక్కుపోయి ఉన్నాయి. బాగా సన్నబడ్డాడు. గోడకు ఫోటో ప్రేములు వేలాడుతున్నాయి. ఫ్యామిలీ ఫోటోలు చిన్నగా ఉన్నాయి. కేసీఆర్‌తో దిగిన ఫోటోలే పెద్దగా కనిపిస్తున్నాయి. పార్టీ పెట్టన నాటి నుంచి మొన్నటి వరకు వివిధ దశల్లో ఆయన రూపు రేఖలు మారుతూ వచ్చినట్టుగా ఆ ఫోటోలు అద్దం పడుతున్నాయి. కళ్లలో జీవం కోల్పోతూ వస్తున్నట్టుగా వరుసగా ఆ ఫోటోల్లో కళ తగ్గుతూ వచ్చినట్టుగా ఉన్నాయి.

‘ రా కూర్చో’ అన్నాడు. మర్యాదగా.

‘ బాగున్నారా..’ అని నేను పలకరిస్తూనే హాల్లో చుట్టూ పరిశీలిస్తున్నా..

నా కళ్లలో సందేహాలను పసిగట్టాడేమో.. ‘ ఇంట్లో ఎవరూ ఉండరు. నేను, నా భార్య అంతే..!

నా సందేహాల్లో ఒక సమాధానం దొరికింది.

ఆయన భార్య హాల్లోకి వచ్చింది. రెండు కప్పుల్లో చాయ్‌ పట్టుకుని. నేను నమస్తే పెట్టిన. ఆమె కూడా నవ్వుతూ బదులిచ్చింది. ఆ నవ్వులో జీవం లేదు. కానీ ఆ కళ్లలో ఆశ్చర్యం కనిపించింది. ఎవరా అని. బహుశా నేను వస్తానని ఆ సీనియర్‌ నేత ఊహించలేదు కాబోలు. ఆమెతో నా వివరాలు .. నేను ఎందుకు వచ్చానో చెప్పి ఉండకపోవచ్చనుకున్నా.

ఇద్దరం చాయ్‌ తాగుతున్నాం. నేను ఆయన వైపే చూస్తున్నాను. ఆయన తన గాజుకళ్లతో నన్నే చూస్తున్నాడు. నేనేం మాట్లాడతానా అని.

కేసీఆర్‌తో మీ బంధం ఎప్పట్నుంచి.. అని మొదలుపెట్టిన నేను. నా వైపు నుంచి చూపు పక్కకు తిప్పాడు. ఎదరుగా గోడ వైపు తీక్షణంగా చూస్తున్నాడు. తన మస్తిష్కంలో చాలా చెప్పాలని ఫిక్స్‌ అయినట్టున్నాడు. వాటిని ఎలా బయట పెట్టాలో తెలియక తికమకపడుతున్నట్టున్నాడు. నా వైపు తిప్పాడు తల.

‘కేసీఆర్‌ కంటే ముందే నాకు తెలంగాణ సోయి ఉండేది. 1967 నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటోన్ని’ అన్నాడు. కేసీఆర్ ద్వారానే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చానని నేను అనుకోవద్దని తన నేపథ్యం గురించి చెప్పే ప్రయత్నం చేశాడాయన.

‘సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్‌ ఆంధ్రజ్యోతిలో ఓ ఆర్టికల్‌ రాశాడు. మన నీళ్ల వాటా ఎంత..? మనకు రావాల్సిన కరెంటు ఏదీ..? ఇక్కడ కరెంటు ఉత్పత్తికి, నీళ్ల సాగుకు కావాల్సిన వనరులు ఎన్ని ఉన్నాయని వివరిస్తూ ఓ వ్యాపం రాశాడు. అది అందరినీ ఆకట్టుకున్నది. నన్ను ఆకర్షించింది. అప్పటి వరకు కేసీఆర్‌ అంటే పెద్దగా ఎవరికీ తెల్వదు. ఎమ్మెల్యేగా ఉండీ అధికార పార్టీ టీడీపీకి వ్యతిరేకంగా తెలంగాణ గురించి ఓ వ్యాసం రాసిండంటే వీడు మొగోడేరా బై అని అనిపించింది. అప్పటి నుంచి ఇక్కడ కేసీఆర్‌ గురించి చర్చ నడిచింది. ఆ తరువాత కరెంటు బిల్లులు పెంచడం, పెంచిన బిల్లులకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్ వద్ద చేపట్టిన ఉద్యమంలో గుర్రాలతో తొక్కించడం కాల్పులు జరపడం పెద్ద కలకలం రేగింది…

చెప్పుకుంటూ పోతున్నాడు. ఆనాటి విషయాలను యాది చేసుకుంటూ. మధ్య మద్యలో నన్ను చూస్తున్నాడు. ఏమైనా డౌట్స్‌ ఉంటే అడుగుతానేమోనని.

‘అప్పటికే 610 జీవో, నాన్‌ ముల్కీ, ఇడ్లీ సాంబార్‌ గో బ్యాక్‌ ఉద్యమాలు నడుస్తున్నాయి. కేసీఆర్‌ కూడా తెలంగాణ కోసం కొట్లాడేందుకు ఇదే మంచి సమయమని తేల్చుకున్నాడు. బషీరాబాగ్‌ కాల్పులకు ముందే ఆయన చాలా మంది మేధావులతో గంటలు గంటలు చర్చలు జరిపెటోడు.

‘ నందినగర్‌లో అతని ఇల్లు అప్పటికి ఇంకా పూర్తి కాలేదు. అక్కడే మీటింగు ఏర్పాటు చేసేవాడు. తెలంగాణకు ఎలా అన్యాయం జరుగుతున్నది.. మన వాటా ఎట్లా నష్టపోతున్నాం.. అనే విషయాలపై అనర్గళంగా మాట్లాడేవాడు. అతని మాటలకు మేమంతా ఫిదా అయిపోయేవాళ్లం.

సింగూరు జలాలను హైదరాబాద్‌ నీటి కోసం ఎలా అన్యాయంగా తరలించుకుపోయేవారో కళ్లకు కట్టినట్టు చెప్పేవాడు.

మెల్లగా దండు మోపైతున్నది. రోజూ నందినగర్‌లోని కేసీఆర్‌ ఇంటి వద్ద జాతర. వచ్చే పోయే వాళ్లతో అక్కడ కిక్కిరిసి ఉండేది.

ఎంత మంది వచ్చినా కేసీఆర్‌ వారందరికీ అన్నం పెట్టి మరీ పంపించేవాడు. దూర దూరాన్నించి వచ్చినవాళ్లంతా కడుపునిండా అన్నం పెట్టిండురా బై … అని నోరారా దీవించిపోయేవాళ్లు.

పార్టీ ఏర్పాటుకు బలం చేకూరుతున్నది. ముహూర్తం ఖరారయ్యే తరుణం ఆసన్నమైంది. కేసీఆర్‌కు కాలం కూడా కలిసివచ్చింది…

(ఇంకా ఉంది)

 

Dandugula Srinivas

Senior Journalist

8096677451

 

You missed