దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో:

అప్పుడు హామీలన్నీ ఇబ్బడిముబ్బడిగా ఇచ్చారు. ఎలాగోల అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు వాటిని అమలుపర్చే సమయం రాగానే కండిషన్స్‌ అప్లై అంటున్నది కాంగ్రెస్‌ సర్కార్. అంతే ఉన్నవాటిల్లో కోత పెట్టాలె. ఆ తరువాత కొత్త హామీల సంగతి. అలాగే ఉందిప్పుడు కాంగ్రెస్‌ సర్కార్ పరిస్థితి. మరక్కడ ఖజానా ఖాళీగా ఉందాయె. మరేం చేస్తుంది ఆ సర్కార్‌ కూడా. ఇప్పుడున్న పింఛన్ల సొమ్ము నెలకు సరిగ్గా వేయడానికే కేసీఆర్‌కు తల ప్రాణం తోకకొచ్చేది. దాన్నే ఎలాగో తంటాలు పడుతూ ఈ ప్రభుత్వమూ వేస్తున్నది ఓ నెల ముందూ వెనక. కానీ ఇప్పుడు జనాలకు కావాల్సింది కేసీఆర్‌ ఇచ్చిన పింఛన్‌ కాదు.. రేవంత్‌ ఇవ్వబోయే రెట్టింపు పింఛన్‌. అదే నాలుగు వేల పింఛన్‌.

ఇప్పుడు దాని కోసమే కసరత్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని నమ్మబలికి మరీ ఓట్లు గుద్దించుకున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు మెల్లగా మాట మారుస్తున్నది. ఖజనాలో పైసలు ఖాళీ చేసేశాడు కేసీఆర్‌..అని నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు సీఎం రేవంత్‌. ప్రజలకు కూడా మెల్లగా అర్థమవుతూ వస్తోంది ఇప్పట్లో ఇవేమీ అమల్లోకి రావని. మెల్లగా నిబంధనల పేరుతో కోతలు విధించి, షరతుల ఆంక్షల్లో లబ్దిదారుల సంఖ్య తగ్గించి, భారం తగ్గించుకుని చేసేశాం అని చెప్పేసి చేతులేత్తేస్తే పోలా..! ఇలాగే ఉంది సర్కార్‌ వైఖరి. సరే, ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటన చేశాడు.

ఫైరవీలు చేసి పింఛన్లు తీసుకున్న వాటిని రద్దు చేస్తామని. ఈ లెక్కన సర్కార్‌ మదిలో ఓ 30 శాతం ఈ కేటగిరీ కింద కట్ చేయాలని భావిస్తున్నట్టున్నది. అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల పింఛన్లు కట్‌ కావొచ్చు. అప్పుడు ఈ మిగిలిన మొత్తంతో 4 వేల పింఛన్‌ అమలు చేయాలని సర్కార్ భావిస్తున్నది. అవీ సరిపోవు. కానీ రెండు రకాల లాభం గవర్నమెంట్‌కు. ఒకటి.. ఉన్న పింఛన్లు తగ్గిస్తే .. కొత్తగా 4 వేల పింఛన్‌ ఇచ్చేటప్పుడు తగ్గిన పింఛన్ల సంఖ్యకే వాటిని అమలు చేయడం ద్వారా తీవ్ర ఆర్థిక భారం నుంచి తప్పించుకోవచ్చు. రెండోది.. కోత కోసిన దాదాపు 12 లక్షల పింఛన్లతో మిగిలిన సొమ్మును దీనికి డైవర్ట్‌ చేయొచ్చు.

మరి ప్రజల నుంచి వ్యతిరేకత రాదా..? అంటే వస్తుంది. రానీ. ఇంతకు మించి సర్కార్‌ కూడా ఏం చేసేదీ లేదు. పాపం..! ప్రభుత్వం పరిస్థితి అలా ఉంది మరి. రానున్న లోకల్‌బాడీ, ఇతరత్రా ఎన్నికల్లో అధికారపార్టీదే హవా ఉంటుంది. దీన్ని ఎవరూ నిలువరించలేరు. నివారించలేరు. ఇక పథకాలు అమలు చేస్తున్నాం.. హామీలు అమలవుతున్నాయని చెప్పుకోవడానికి ఇలాంటి కోతలు కోస్తే తప్ప రేవంత్‌కు అది సాధ్యమయ్యేలా లేదు. ఎవరన్నా ఎక్కువగా మాట్లాడితే… అవన్నీ అర్హతలేనివని చెప్పొచ్చు. ఇదీ సర్కార్‌ ఎత్తుగడ.

 

 

You missed