దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
ఒకరు పునాదులు వేస్తూ వచ్చారు. ఇప్పుడు వాటిని పెకిలిస్తూ వస్తోంది మరొకరు. ఇప్పుడిది అంతటా చర్చ. బీఆరెస్, కాంగ్రెస్‌ల మధ్య ఓ రచ్చ. ఎన్నికలకు ముందు ఏడాది బీఆరెస్ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేసింది. కుల సంఘాల భవనాలకు, గుడులు, మసీదుల నిర్మాణాలకు, కమ్యూనిటీ హాళ్లకు ప్రొసీడింగులు కూడా ఇచ్చింది. కానీ ఆ తరువాత సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో వీటన్నింటికీ బ్రేక్ వేసింది ప్రభుత్వం. నిధుల కొరత సాకుగా చూపడంతో పాటు..ఇవన్నీ బీఆరెస్ నాయకులు తమకు మైలేజీ వచ్చే విధంగా ఇచ్చారని కాంగ్రెస్ భావిస్తోంది. టెండర్లు అయి పనులు ప్రారంభమయ్యే వాటిని కూడా ఆపేశారు. శంఖుస్థాపనలు వేసినా అవి ఉత్సవ విగ్రహాల్లాగే మిగిలిపోయేలా చేశారు కాంగ్రెస్ నాయకులు.
ఇదిప్పుడు బాల్కొండలో చర్చకు తెర తీసింది. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటన పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది. తన హయంలో మోర్తాడ్‌లో న్యాక్ ద్వారా ఐదు కోట్ల నిధులతో నిర్మించ తలపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులు ఆపాలని తాజాగా ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో ఇక బయటకు రాక తప్పని పరిస్తితి ఏర్పడింది ఎమ్మెల్యేకు. ఇదేనా మీరు కోరుకునే మార్పు అంటూ ఆయన విమర్శల అస్త్రం సంధించడంతో పాటు ఈ పరిణామాలపై అంతా నిలదీయాలని పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.