మంత్రి కేటీఆర్‌ కామారెడ్డి జిల్లా పర్యటన సందర్బంగా మరోసారి తన విశ్వరూపం చూపాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన ఆయన ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్లు క్లియర్‌ చేశాడు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ మళ్లీ అక్కడి నుంచి పోటీ చేస్తాడని ప్రకటిస్తూనే… షబ్బీర్‌ అలీ ఇన్నేండ్లు గాడిద పండ్లు తోమాడా? ఆ పాచిపోయిన ముఖం మళ్లీ మనకవసరమా అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌కు పర్మినెంట్‌గా లైన్ క్లియర్‌ చేశాడు ఈ బహిరంగ సభ వేదికగా. సురేందర్‌ మీ శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటాడు.

మళ్లీ మళ్లీ గెలిపించుకోండంటూ కోరాడు. కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోస్తూ రెండు పిట్ట కథలు చెప్పాడు. ఏమీ చేయకున్నా.. చేసే వాళ్లను తిడుతూ బతికే పాచిపోయిన ముఖాలు కాంగ్రెస్‌ వాళ్లవంటూ దునుమాడాడు. అప్పుడు రెండు వందల పింఛన్‌ ఇవ్వలేని వాళ్లు ఇప్పుడు నాలుగు వేల పింఛన్‌ ఇస్తామంటే నమ్ముతారా అని ప్రశ్నించాడు. పనిలో పనిగా మోడీపై విరుచుకుపడ్దాడు.

నాలుగు వందల గ్యాస్ సిలిండర్‌ ధరను పన్నెండు వందలకు చేసి.. పదిహేను లక్షల రూపాయలను ఖాతాల వేస్తానని చెప్పి పదిహేను లక్షల సార్లు మన గుండు కొట్టాడని విమర్శించాడు. వీళ్లను నమ్ముకుంటే ఊదు కాలదు.. పీరి లేవదని విమర్శించాడు. ఆఖరికి ఉచ్చ పోయాలన్నా ఢిల్లీ నుంచి పర్మిషన్‌ రాకపోతే ఏమీ చేయలేరని, కేసీఆర్‌ మాత్రం తనుకున్నదే తడవుగా సంక్షేమ పథకాలు అమలు చేసి చూపుతున్నాడని, ఢిల్లీ బానిసలకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరు ఇదని, కేసీఆర్‌ వైపే అందరూ నిలబడాలని కోరారు.