కాంగ్రెస్ పార్టీ సోమవారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ రైతుల్లోనే మీమాంస నెలకొందా..? అంటే అవుననే గుసగుసలే వినిపిస్తున్నాయి. రికార్డు లెవెల్లో కుంభవృష్టి కురిసి వరద పోటెత్తినప్పుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాధితుల మధ్య ఉన్నాడు… ఆ సమయంలో మొహం చాటేసిన మన నేతలు స్వాగత సభలు నిర్వహించుకొని తీరా ఇప్పుడే తీరిక దొరికింది అన్నట్లుగా.. ఇచ్చిన ధర్నా లో పాల్గొంటే కూర్చున్నవాడికైనా ఇది లేదు.. చూసేవాడి అయినా ఇది ఉండాలి కదా అన్నట్లుగా ఉంటుందేమో అనే మొహమాట పరిస్థితి రైతుల్లో కనిపిస్తున్నది.

కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ ఈ ధర్నా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందనే భిన్నాభిప్రాయాలు నెలకొన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా కాంగ్రెస్ నేత సునీల్‌రెడ్డి ప్రజల వరద బాధలకంటే ఆహా ఓహో అనేలా కాంగ్రెస్లోకి తన రాకనే ముఖ్యమని వైఖరిని అవలంభించడం వల్ల వరదల వేళ ప్రజలకు అనివార్యంగా దూరంగా ఉండాల్సిన రాజకీయ దౌర్భాగ్యం నెలకొందనే ఆవేదన కొందరు ముఖ్య నేతల్లో నెలకొన్నట్లు సమాచారం. సదరు తాజా నేత ఢంకా భజాయించుకోవడమే ముఖ్యమని వ్యూహం లో ఉండగా తాము ప్రజల మధ్యకు వెళ్తే గ్రూపు రాజకీయాలు అంటూ.. వచ్చి రాగానే ఏడుపులు మొదలు పెడితే పార్టీకి నష్టమని దూర దృష్టితో వరదల వేళ ప్రజల మధ్యకు వెళ్లలేకపోయామని మదన పడుతున్నట్లు సమాచారం.

ఇటువంటి పరిస్థితుల్లో ధర్నా చేపడితే పరిస్థితి అనుకూలమా అననుకూలమా అనే చర్చ కూడా లేకుండా కార్యక్రమం చోటు చేసుకున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. మీరు ఏమన్నా చెప్పండన్నా.. ఏమన్నా అనుకోండన్నా.. అంత భారీ వరదల్లో మనం కనీసం విమర్శలు వచ్చేదాకా జనం చెంతకు పోలేదు. అవతల మంత్రి ప్రశాంత్ రెడ్డి, కార్యకర్తలు వారం పాటు ప్రజలతోనే ఉన్నారు. ఈ ధర్నాతో కాంగ్రెస్ పార్టీకి లోపాన్ని అంట కట్టుకోవడం తప్ప ప్రయోజనం ఏమన్నా ఉంటుందా అనే చర్చ రైతుల్లో వినిపిస్తున్నది.

You missed