ధర్మపురి సంజయ్… మాజీ మేయర్. అర్బన్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నాడు. ఒంటరి పోరుకు సిద్దపడ్డాడు. లోకల్ లీడర్ షిప్ ఆయనకు సహకరించడం లేదు. అయినా శక్తి వంచన లేకుండా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. లాబీయింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. అర్బన్ కాంగ్రెస్ బీసీకే ఇస్తారని ప్రకటించిన నేపథ్యంలో బలమైన మున్నూరుకాపు సామాజిక వర్గంతో పాటు తన తండ్రి డీఎస్ ముస్లిం మైనార్టీలతో ఉన్న సంబంధాలు తన రాజీకయ భవిష్యత్తుకు దోహదపడతాయని భావిస్తున్నాడు సంజయ్. అందుకే సమయం చిక్కినప్పుడల్లా ఢిల్లీ టూర్‌లో కాంగ్రెస్ పెద్దలను కలిసి వస్తున్నాడు. ఇవాళ సోనియా గాంధీని కలిసి మాట్లాడాడు.
డీఎస్ ఆరోగ్యంపై ఆమె ఆరా తీసినట్టు తెలిసింది. జిల్లా,అ ర్బన్ రాజకీయాలపై డిస్కషన్ జరిగినట్టు సంజయ్ అనుచర వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో పాటు, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కూడా కలిసి తన అభ్యర్థిత్వంపై మరోసారి ఆయన చర్చకు తీసుకువచ్చినట్టు తెలిసింది. ఓ వైపు సంజయ్‌కు టికెట్ దక్కకుండా చేద్దామనే లోకల్ లీడర్ షిప్‌కు సంజయ్ ఢిల్లీ లాబీయింగ్ కొరకరాని కొయ్యలా తయారయ్యింది. ఎవరెన్ని ఆటంకాలు పెట్టినా టికెట్ తనకే దక్కేలా శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు, లాబీయింగ్ చేస్తున్నాడు సంజయ్.
ఓ రకంగా జిల్లా కాంగ్రెస్‌లో సంజయ్ ఒంటరి పోరే చేస్తున్నాడు. లాబీయింగ్‌తో తన పని తాను చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాడు. పనిలో పని ఇక్కడ లోకల్ లీడర్లను కూడా కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకు తప్ప ఇంకా ఎవరికీ అర్బన్ టికెట్ ఇచ్చే అవకాశమే లేదనే సంకేతాలు ఇప్పించేందుకు ఢిల్లీ లాబీయింగ్‌తో శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు.