నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ పై ఎమ్మెల్సీ కవిత కళికావతారం ప్రదర్శించారు. బుధవారం నిజామాబాద్‌ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు కేటీఆర్‌ వచ్చిన సందర్భాన్ని తీసుకుని అర్వింద్‌ చేసిన కామెంట్లపై ఆమె ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లోని బీఆరెస్‌ఎల్పీలో ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాలతో కలిసి ఆమె ప్రెస్‌మీట్‌లో మాట్టాడారు.

నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ముగ్గురి ముగ్గురికి ఆశలు పెట్టుకుంటూ నీకంటే నీకు టికెట్‌ ఇస్తానని వారిని మోసం చేస్తున్నాడని, ఓ వైపు తప్పుడు హామీలతో దొంగ బాండు పేపర్లతో ప్రజలను మోసం చేసి గెలిచిన అర్వింద్‌.. ఇప్పుడు సొంత పార్టీ నేతలను కూడా మోసం చేస్తున్నాడని, అందుకే అంతా కలిసి పార్టీ ఆఫీసులపై దాడులు చేసి రచ్చ రచ్చ చేసుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. నిజామామాద్‌ ఎంపీగా తాను గెలవనని ఎంపీ అర్వింద్‌కు తెలసిపోయిందని, ఇక ప్రజలు తనను నమ్మరని డిసైడ్‌ అయిపోయారన్నారు. అందుకే ఎంపీగా కాకుండా ఎమ్మెల్యే కోసం నిజామాబాద్‌ ఒదిలిపెట్టి కోరుట్లకు పారిపోదామని నిర్ణయం తీసుకున్నాడని, తాను మాత్రం నిజామాబాద్‌ను వదిలేదే లేదన్నారు.

ఎంపీగా పోటీ చేసి గెలిచిచూపిస్తానన్నారు. ఎంపీ అర్వింద్‌ కోరుట్ల కు పోయినా.. మరెక్కడికి పోయినా.. ముందే చెప్పినట్టు వెంటాడి ఓడిస్తామని, డిపాజిట్‌ కూడా రానీయమని ఆమె పునరుద్ఘాటించారు. పార్లమెంటులో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని ఆమె హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో కేంద్రం నుంచి ఒక్క పైసా కాంట్రిబ్యూషన్‌ లేదని.. కానీ సోషల్‌ మీడయా వేదికగా ఏవో అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకునే అర్వింద్‌ మాటలకు విలువ లేకుండా పోయిందని,ప్రజలు ఏనాడో నమ్మడం మానేశారని తెలిపారు. బిడ్డా నిన్ను వదిలేదు లేదు.. నువ్వెక్కడికి వెళ్లినా నిన్ను వెంటాడుతామని ఆమె తీవ్ర స్థాయిలో శపథం చేశారు.

నిజామాబాద్‌ ఎంపీగానే తాను పోటీ చేస్తానని ఆమె మరోసారి స్పష్టం చేశారు. సీఎంకు సవాల్‌ విసిరే స్థాయి అరవింద్‌ది కాదన్నారామె. బాజిరెడ్డి గోవర్దన్‌ మాట్లాడుతూ.. నీకు సరైన సమాధానం మా కింది స్థాయి లీడర్ల నుంచి ఇప్పిస్తామని, బూతులకు పచ్చి బూతులే నీకు సమాధానమని ఇక కాస్కో అంటూ సవాల్‌ విసిరారు. అర్బన్‌ ఎమ్మెల్యే మాట్లడుడూ అత్యంత జుగుప్సాకరంగా, నిరక్షరాస్యుడిగా మాట్లాడే ఏకైక ఎంపీ అర్విందేనని, అసలు తనకు ఉన్న క్వాలిఫికేషన్‌ ఏమిటని ఆయన ప్రశ్నించారు. కవిత, కేటీఆర్‌లను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వారు రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం.. ఉద్యమంలో పాల్గొన్న సందర్బాలు ప్రజలకు తెలుసునన్నారు.

You missed