మరుసటి రోజు కేటీఆర్ టూర్. అంతకు ముందు రోజే మంగళవారం జడ్పీ సర్వసభ్య సమావేశంలో విభేదాలు రచ్చకెక్కాయి. గోటితో పోయేదాన్ని జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు. తెగ దాకా తీగలాడి వదిలేశారు. ఎన్నిసార్లు చెప్పినా వైఖరిలో మార్పులేనని మంగళవారం నిర్వహించ తలపెట్టిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి డుమ్మా కొట్టారు. అధికారులు వచ్చి గంటల తరబడి వెయిట్ చేసినా ఫలితం లేదు. దీంతో మరో గంట వారికి అవకాశం ఇచ్చి చూశాడు చైర్మన్. అయినా వినలేదు. వీరంతా ముందస్తు ప్లాన్ వేసుకుని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రహస్య మీటింగు పెట్టుకున్నారు.
ఎంత బతిమాలినా ఎవరూ వెళ్లొద్దని తీర్మానించుకున్నారు. సమయం ముగిసే వరకు చూసిన జడ్పీ చైర్మన్ కోరం లేక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించేశాడు. జడ్పీ చైర్మన్ వైఖరి వివాదస్పదంగా ఉందని, ఒంటెత్తు పోకడలతో సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని, దీనికి తోడు సీసీ మహేశ్‌ను తొలగించాలని పలు మార్లుచెప్పినా పెడచెవిన పెడుతున్నారనేది వారి వాదన. దీన్ని చైర్మన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు తెలియకుండానే అన్ని పనులు చేసేసి చుట్టపు చూపుగా సభ్యులను ఆహ్వానించడం పట్ల కూడా వారంతా గుర్రుగా ఉన్నారు. సీఎంతో సబంధాల పేరుతో తన పరపతిని పెంచుకునే ప్రయత్నమే గానీ సభ్యుల గౌరవ మర్యాదలు పట్టించుకునే స్థితిలో ఆయన లేడనేది అందరి సభ్యుల ప్రధాన ఆరోపణ.
దీన్నిపై తమయ నిరసన తెలిపేందుకు జడ్పీ సర్వసభ్య సమావేశం సరైన సమయం అని ఎంచుకున్నారు. ఇదంతా జడ్పీ చైర్మన్‌కు ముందే తెలుసు. కేటీఆర్ నిజామాబాద్ టూర్ ఉన్న నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేసుకున్న అయిపోయేది. పంతానికి పోయి అందరికీ సమాచారమిచ్చాడు. అధికారులు వచ్చి గంటల తరబడి వేచి చూసి వెళ్లిపోవాల్సి వచ్చింది. విషయం రచ్చకెక్కింది. అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నది. మరోవైపు ప్రైవేటు హోటల్‌లో భేటీ అయిన అధికార పార్టీ జడ్పటీసీలంతా చీటీలు కూడా తీసుకున్నారు. చైర్మన్‌ను తప్పిస్తే ఎవరు చైర్మన్ కావాలనేది కూడా క్లారిటీ తీసుకుని రెడీగా ఉన్నారట. అంత వరకూ వచ్చింది మరి పరిస్తితి.