కాంగ్రెస్‌లో ఒకప్పుడు ఆ డీఎస్ హవా అంతా ఇంతా కాదు. ఓ వెలుగు వెలిగిన చరిత్ర. కానీ కాలచక్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మేయర్‌గా రాజకీయ ఆరంగేట్రం చేసిన ధర్మపురి సంజయ్ కూడా రాజకీయ అజ్ఞాతం పట్టాల్సి వచ్చింది. బీఆరెస్‌లో చేరినా అక్కడ ఇమడలేకపోయారు డీఎస్, డీఎస్ తనయుడు సంజయ్. చాలా కాలం తర్వాత తన రాజకీయ భవిష్యత్తును మళ్లీ పోయిన చోటే వెతుక్కునేందుకు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు సంజయ్. కానీ ఆనాటి నుంచి అతను ఒంటరే. సీనియర్లకు నచ్చలేదు. సహకరించలేదు. ఒప్పుకోలేదు. కలిసి రాలేదు. కానీ సింగిల్‌గానే తిరిగాడు. చేరికలు చేర్పించుకున్నాడు. కార్యక్రమాలు నిర్వహించుకున్నాడు.
మేమంతా ఒక్కటేనని చెప్పుకుంటున్నా.. ఇప్పటి వరకు జిల్లా పార్టీ కాంగ్రెస్ భవన్ మెట్లెక్కలేదు. ఎప్పుడెక్కుతారు..? ఎప్పుడు వెళ్తారు..? అన్న ప్రశ్నలకు మంచి ముహూర్తం చూసుకుంటాను అని బదులిచ్చి తప్పించుకున్నా.. సరిగ్గా అదే జరిగింది. ఇవాళ రాహుల్‌గాంధీకి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో సంబురాలు చేసుకునేందుకు పార్టీలో ఆఫీసులో సీనియర్లు ఎవరూ లేరు. ఎవరి కార్యక్రమాల్లో వారు బిజీగా ఉన్నారు.
దీంతో సంజయ్ పార్టీ ఆఫీసులోకి తన అనుచరగణంతో ఎంట్రీ ఇచ్చాడు. శ్రావణ శుక్రవారం, తన తండ్రికి పీసీసీ పదవి వచ్చిన శుభదినం, రాహుల్‌గాంధీకి అనుకూలమైన తీర్పు వచ్చిన మంచి రోజు.. ఇంతకు మించి మరేం కావాలి.. అందుకే ఇలా ఎంట్రీ ఇచ్చాను. సంబురాలు చేసుకున్నాను అంటూ మీడియాకు సమాధానమిచ్చాడు. మొత్తానికి సంజయ్ చాన్నాళ్ల తర్వాత పార్టీ ఆఫీసు మెట్లెక్కి.. గడపడం, సంబురాలు చేసుకోవడం ఆ పార్టీతో పాటు ఇతర పార్టీల్లో కూడా చర్చనీయాంశమైంది.