నాలుగు వందల ఏళ్ళ ముందు మన దేశంలో టమాటో పంట లేదు .
జైనులు ఇప్పటికీ, వంటల్లో ఉల్లి వాడరు.

టమాటో.. ఉల్లి .. రెండిటి విషయం లోనూ ధరల ఒడుదుడుకులు చూస్తుంటాము .
మదనపల్లి లో టమాటో మార్కెట్ కి ప్రసిద్ధి .అక్కడ కిలో టమాటో కనీసం రూపాయి పలకకుండా లారీ ల కొద్దీ టొమాటోలను రైతులు కింద పారేసిన సందర్భాలు కోకొల్లలు .

మొన్నటి దాకా విపరీతమైన ఎండలు . అటు పై వాతావరణ మార్పుల వల్ల టమాటో ఉత్పత్తి సరఫరాలో తేడా వుంది . డిమాండ్ స్థిరంగా ఉండి సరఫరా తగ్గితే రేట్ లు సహజంగా పెరుగుతాయి . ఇది ఆర్థిక శాస్త్రం లో ప్రాధమిక సూత్రం .

ఇప్పుడు టమాటో ధర ఎక్కువగా వుంది .
నెల రోజుల పాటు టమాటో లేకుండా వంటకాలు చేసుకోవచ్చు . కొన్ని లక్షల తరాల పాటూ, మన పూర్వీకులు అలాగే తిన్నారు .
తిరిగీ టమాటో ధర అయిదు రూపాయిలకో పది రూపాయిలకో పడి పోతుంది . అప్పుడు టమాటో రైస్ …టమాటో కర్రీ.. టమాటో పికెల్.. టమాటో జ్యూస్.. టమాటో చట్నీ .. ఇలా యాభై వంటకాలు తయారు చేసుకొని టమాటో ఫెస్టివల్ జరుపుకోవచ్చు

టమాటో ఉల్లి ధరలు పెరిగినప్పుడు మీడియా, అంతకు మించి ఇప్పుడు సోషల్ మీడియా లో జరిగే హడావుడి అంతాఇంతా కాదు . జోకులు కార్టూన్ లు .. అబ్బబబబ …

ఎకరా భూమి రేటు ఇప్పుడు కోటి రూపాయిలు .. కోటి రూపాయలకు రెండు రూపాయిల చొప్పున వడ్డీ లెక్క వేస్తే సంవత్సరానికి వడ్డీ ఇరవై నాలుగు లక్షలు . పోనీ ఒక రూపాయి ధర్మ వడ్డీ అనుకొంటే పన్నెండు లక్షలు . ఎకరం పొలం లో పది వేల కిలోల టొమాటోలు పండించొచ్చు . అంటే కేవలం వడ్డీ కట్టాలంటే కిలో టమాటో 120 పలకాలి . రెండు రూపాయిల వడ్డీ అంటే 240 . టమాటో సాగుకు అయ్యే ఖర్చు అదనం .

సాగు చేసి కోటీశ్వరుడు అయిన రైతు ను నేను ఇప్పటిదాకా చూడలేదు .
సాగు కు రైతును దూరం చెయ్యాలి . వ్యవసాయం బడా కంపెనీ ల చేతుల్లోకి పోవాలి . ప్రపంచ వ్యాపితంగా ఇదే కుట్ర . ఈ నేపధ్యం లో రైతు కన్నీరు మన ఇంట పన్నీరు అవుతోంది . మరి కొనేళ్లకు వ్యవసాయం పూర్తిగా కార్పొరేట్ ల చేతికి పొతే రోజుకు రెండు పూటలా తినడానికి రెండు ఉద్యోగాలు చెయ్యాల్సి వస్తుంది .

Amarnath Vasireddy

You missed