మన ఇందూరు నుంచి …
మూడు ఎమ్మెల్సీలు గాయాబ్….?
పూర్వవైభవం ఘనం.. ప్రస్తుతం పదవుల లేక డీలా…
రెండు ఎమ్మెల్యే కోటా, ఒకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను మిస్ అవుతున్న జిల్లా…
రాజకీయంగా ఇది బీఆరెస్‌కు భారీ లోపమే..? జిల్లాను ఎందుకు పట్టించుకోవడం లేదు….
కవిత ఓటమి తర్వాత సీఎంకు జిల్లాపై ఇంట్రస్ట్ తగ్గిందా..?
ప్రతిపక్షాలు బలోపేతమవుతున్న తరుణంలో … పదవుల పంపకాల్లో మరింత దూకుడు పెంచాల్సిందే…
అసంతృప్తులు పెరుగుతున్నారు. ఆశావహులు ఎదురుచూపులతో విసిగి పోయారు…
ఎన్నికల ముంచుకొస్తున్న తరుణంలో జిల్లాలో విచిత్ర పరిస్థితి….
ఇందూరు జిల్లా బీఆరెస్‌కు కంచుకోట. అన్ని స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసి రాష్ట్ర రాజకీయాల్లోనే జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టుకున్నది. సీఎం కూతురు కవితే జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న నేపథ్యంలో ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకం, విశ్వాసం. ఏదో భరోసా. మన జిల్లా మరింత అభివృద్ది చెందుతుందని. అందుకే ఆమె ప్రభావం, ప్రమేయం జిల్లాలో పార్టీ బలోపేతానికి ఇతోధికంగా ఉపయోగపడిందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. కానీ, రాను రాను పరిస్థితి తారుమారవుతోంది. ఎంపీగా కవిత ఓడిపోవడం జిల్లాకు శాపంగా మారింది. సీఎం కేసీఆర్‌కు జిల్లా అంటే మొదటి నుంచి ప్రత్యేక అభిమానం. ఇక్కడి రైతులు, వ్యవసాయం ఆయనకు ఇష్టం.
ఇప్పటికే అంకాపూర్ రైతుల గురించి తలుచుకుంటూ ఉంటారు. ఇక్కడి ఉద్యమస్పూర్తిని నెమరువేసుకుంటూ ఉంటారు. తొలిసారి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కట్టబెట్టి పార్టీకి, ఉద్యమానికి ఊపిరి పోసిన జిల్లాగా ఆయన గతాన్ని నెమరువేసుకూంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే కవిత ఓడిపోయిందో.. అప్పటి నుంచి ఆయన జిల్లాపై పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదనిపిస్తుంది. పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆవేదనా ఆ పార్టీ నేతల్లో ఉంది. దీనికి తాజా ఉదాహరణగా ఎమ్మెల్సీలను జిల్లా కోల్పోవడమే. గతమెంతో ఘనం. కానీ ఇప్పుడు జిల్లాకు చెందిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను కోల్పోయే పరిస్థితి వచ్చింది.
రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు… ఒకరు ఆకుల లలిత, మరొకరు వీజీ గౌడ్, తాజాగా గవర్నర్ కోటా రాజేశ్వర్ పదవీకాలం ముగిసిపోయింది. ఆకుల లలితకు మళ్లీ ఎమ్మెల్సీని రెవ్యూవల్ చేస్తామన్నారు. చేయలేదు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. చివరి నిమిషంలో అది కవితకు కేటాయించారు. ఆమెకు ఉమెన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గిరీ ఇచ్చారు. పెద్దగా సంతృప్తి లేదు ఆ పదవితో వారికి. ఇక వీజీ గౌడ్‌కు కూడా హామీ ఇచ్చారు. ఈ గవర్నర్ కోటాలో తనకు ఛాన్స్ వస్తుందని ఆశించారు. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. గవర్నర్ కోటాలో నాకు వస్తుందంటే నాకు వస్తుందని చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. కానీ సీఎంకు మాత్రం జిల్లాకు ఎమ్మెల్సీ పేరును ప్రతిపాదించే ఆలోచనే ఉన్నట్టు లేదు. ఇక్కడ ప్రతినిథ్యం వహిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత కూడా జిల్లాకు ఈసారి కచ్చితంగా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలి అని సీఎం కేసీఆర్‌ను కోరే పరిస్థితులూ అక్కడ లేవు.
దీంతో బాస్ మదిలో ఏముంటే అది. ఎవరికివ్వాలో చివరి నిమిషం వరకు ఆయనకు తప్ప మరొకరి తెలిసే ఛాన్స్ లేదు. జిల్లాకు ఇస్తారన్న ఆశా లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త పదవులు ఏమైనా వస్తాయని క్యూలో చాలా మందే ఆశావహులున్నారు. కనీసం పార్టీ పదవులన్నా ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తున్నారు. అవేమీ లేకపోగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు మంగళం పాడేయడం కూడా జిల్లా పార్టీలో నాయకులకు తీవ్ర నిరాశ, నిస్పృహలనే మిగల్చనుంది. సామాజికవర్గాల వారీగా చూసినా ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ …. తమ ఎమ్మెల్సీలను కోల్పోయారు.