ధర్మపురి సంజయ్‌కు చెక్ పెట్టేందుకు..
తెరమీదకు మరో బీసీ క్యాండిడేట్…
అర్బన్ హస్తం పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్…
డాక్టర్ శివ ప్రసాద్‌కు గాలం వేస్తున్న మాజీ మంత్రి, సంజయ్ వ్యతిరేక శక్తులు..
పద్మశాలి ఓట్లు, బీసీ కాన్సెప్ట్ కలిసొస్తుందనే అంచనా.. సర్వేలు చేయించుకున్న హస్తం పార్టీ నేతలు…
(నిజామాబాద్ అర్బన్- పాలిటిక్స్)
ధర్మపురి సంజయ్‌పై జిల్లా కాంగ్రెస్ పార్టీలో కోల్ద్ వార్ మొదలయ్యింది. ఆది నుంచి అతని రాకను ఏమాత్రం సహించని సీనియర్ నేతలంతా సంజయ్‌కు అర్బన్ టికెట్ రాకుండా అడ్డుకునేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. బీసీ కార్డుతో, తండ్రి పలుకుబడితో అధిష్టానం వద్ద తనకు హామీ లభించిందని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్న దోరణిని సీనియర్ నేతలు ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు. ఎలాగైనా సంజయ్ దూకుడుకు అడ్డుకట్ట వేసి .. బీసీకార్డు మీదే ప్రత్యామ్నాయ అభ్యర్థిని మరొకరిని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. పద్మశాలి సామాజికవర్గం నుంచి బీఆరెస్‌లో ప్రస్తుతం నుడా డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ సందా శివప్రసాద్‌కు గాలం వేశారు.
మొన్న జరిగిన పద్మశాలి ఎన్నికల గెలుపులో శివప్రసాద్ కీలకంగా వ్యవహరించి తన సామాజికవర్గంలో సత్తా చాటుకున్నాడు. అర్బన్‌లో మున్నూరుకాపులు, పద్మశాలీ ల ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రతీసారి లాగే ఈ సారీ బీసీ కాన్సెప్ట్ ఇక్కడ బలంగా వినిపిస్తోంది. మహేశ్‌కుమార్ గౌడ్, తాహెర్ లు ఇప్పటికే ఇక్కడ రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ అంతో ఇంతో పుంజుకుంటున్న తరుణంలో పాత నాయకులతో పోటీ చేయించి చూస్తూచూస్తూ ఓటమిపాలవ్వడం ఎందుకు..? కొత్త అభ్యర్థిని ఎంచుకోవాలనే అన్వేషణలో భాగంగా వారికి శివప్రసాద్ కనిపించాడు. సర్వేలు చేయించారు . ఓకే. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. సంజయ్‌కు చెక్… బీసీ నుంచే మరో బలమైన సామాజికవర్గం నుంచి కొత్త ముఖం. అదే శివప్రసాద్.
శివ ప్రసాద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి… రేవంత్‌తో ఇక్కడి పరిస్థితులు వివరించి.. సంజయ్ కు ఆల్టర్నేట్ ఇదిగో.. అని చూపించి మెప్పించి ఒప్పించాలనే నిర్ణయంతో సంజయ్‌పై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ వ్యతిరేక వర్గమంతా రెడీ అయ్యింది. కానీ ఇంకా శివప్రసాద్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. పీఆర్పీ నాటి నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్నా… అతనికి పెద్దగా పదవులేవి వరించలేదు. కవిత సూచన మేరకు నుడా డైరెక్టర్‌తో సరిపెట్టుకున్నాడు. తన రాజకీయ భవిష్యత్ భారం కవితపై మోపాడు. ఆమె ఇటీవల రాజకీయాల్లో యాక్టివ్ కావడం… పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరినీ కలుపుకుని పోవడం.. అసంతృప్త నేతలను బుజ్జగించి నేనున్నాననే భరోసా ఇవ్వడం… మొన్నటి వరకు తెరవెనుక ఉండి గుర్తింపు, పదవులు లేవని మనోవేదనకు లోనవుతున్న వారిలో కొత్త ఆశలు చిగురింపజేశాయి.
ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇంత ఓపిక పట్టి.. రాజకీయాల్లో తనకంటూ ఓ క్లీన్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న శివప్రసాద్… వెంటనే పార్టీ మారాలనే ఉద్దేశ్యం తో లేడన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్లు రాయబారాలు నడుపుతున్నారు. సంజయ్‌కు చెక్ పెట్టేందుకు శివప్రసాద్ అభ్యర్థిత్వమే విరుగుడుగా భావిస్తున్నారు. ఎవరి అవసరాలు వారివి… ఎవరి అవకాశాలు వారివి. సమయం వచ్చినప్పుడే సకాలంలో తీసుకునే నిర్ణయమే ఎవరి భవిష్యత్తు ఏమిటో తేల్చనుంది. అర్బన్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతానికి ఇలా ఊహించని మలుపులు తిరిగి ఉత్కంఠకు తెరలేపుతోంది…