రాజకీయ అజ్ఞాతంలో అన్నపూర్ణమ్మ
ఆర్మూర్ నుంచి బరిలో దిగాలంటున్న అభిమానులు..
సునీల్‌రెడ్డి వర్గం నుంచి మల్లిఖార్జున్ రెడ్డికి సంకట స్థితి
ఆర్మూర్ నుంచి అమ్మ పునరాగమనం బెటర్ అంటున్న పార్టీ శ్రేణులు…
అధిష్టానానిదీ ఇదే ఆలోచన..? కానీ ఆర్మూర్‌పై అర్వింద్ పట్టుదల ఆటంకమా..?
సుధీర్ఘ రాజకీయ ఫ్యామిలీపై బాండ్ పేపర్ ఎఫెక్ట్..
“సుధీర్ఘ రాజకీయ నేపథ్యమున్న కుటుంబం బీజేపీలో చేరింది. ఇది బీజేపీ బలోపేతానికి దోహదపడుతుంది” ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, దివంగత మంత్రి ఏలేటి మహిపాల్ రెడ్డి సతీమణి అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు ఏలేటి మల్లిఖార్జున్‌రెడ్డి బీజేపీలో చేరినప్పుడు ఎంపీ అర్వింద్ అర్వింద్ చెప్పిన మాటలు ఇవి.
కానీ బీజేపీలో చేరిక అన్నపూర్ణమ్మకు, మల్లిఖార్జున్ రెడ్డికి మాత్రం వారు అంచనా వేసుకున్నంతగా కలిసి రావడం లేదనే అభిప్రాయాలున్నాయి. కుమారుడు మల్లిఖార్జున్ రెడ్డిని ఎమ్మెల్యేను చేయాలని అన్నపూర్ణమ్మ ఆశించారు. కానీ బాల్కొండ నియోజకవర్గ టికెట్ కోసం ఆ పార్టీలో చేరడానికి ఆరెంజ్ ట్రావెల్స్ యజామాని ముత్యాల సునీల్ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో బీజేపీలో చేరిక జరగకుండానే సునీల్ రెడ్డికి బీజేపీలో అనుచరవర్గం తయారయ్యింది. మల్లిఖార్జున్ రెడ్డికి టికెట్ వస్తే బీజేపీలోని సునీల్‌రెడ్డి గ్రూపు గెలుపోటములపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నది అనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
మరోవైపు ధర్మపురి అర్వింద్ మల్లిఖార్జున్ రెడ్డికి ఓపెన్ గానే అండగా నిలుస్తూ వస్తున్నారు. కానీ అర్వింద్ పసుపుబోర్డు బాండు పేపర్ వ్యవహారం మల్లిఖార్జున్ రెడ్డిపై ప్రతికూల ప్రభావం చూపించడం మొదలైందని .. ఇవన్నీ రేపు ఎన్నికల వేళ ప్రతికూల ఫలితాలను ఇస్తాయని అన్నపూర్ణమ్మ తన రాజకీయ అనుభవం ద్వారా గుర్తించాలని సమాచారం. ఈ పరిస్థితుల్లోఅన్నపూర్ణమ్మనే ఆర్మూర్ నుంచి ఎన్నికల బరిలో దిగడం మేలని వారి అభిమానులు గట్టిగా సూచిస్తున్నారనే ప్రచారం ఉంది. అన్నపూర్ణమ్మ సైతం తాను ఆర్మూర్ బరిలో దిగడానికే సంసిద్దత వ్యక్తం చేయగా.. తల్లి నిర్ణయాన్ని మల్లిఖార్జున్ రెడ్డి తీవ్రంగా ఖండించినట్టు గుసగుసలున్నాయి.
దీంతో మనస్తాపానికి చెందిన అన్నపూర్ణమ్మ రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లారనేది ఆర్మూర్ నియోజకవర్గంలో ఆమె అనుచరుల వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఈ పరిణామాల క్రమంలో మల్లిఖార్జున్‌కు బదులు ఇది వరకే ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన అన్నపూర్ణమ్మను ఆర్మూర్ నుంచి బరిలో దింపితే ఆర్మూర్‌లో బీజేపీకి బలమైన అభ్యర్థి కొరత తీరడంతో పాటు వారి కుటుంబానికి న్యాయం చేసినట్టవుతుందని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కార్యకర్తల్లో ప్రచారం జరుగుతున్నది. కానీ అర్వింద్ తాను ఆర్మూర్ నుంచి పోటీ చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించకపోవడం అధిష్టానం ఆలోచనలకు బ్రేకులు వేస్తున్నది. దీంతో అన్నపూర్ణమ్మ రాజకీయ అజ్జాతం వీడే పరిస్తితి కలగడం లేదని ఆర్మూర్ బీజేపీ శ్రేణుల్లో, అన్నపూర్ణమ్మ అభిమానుల్లో నైరాశ్యం నెలకొన్నది.