ఎమ్మెల్సీ కవిత అర్బన్‌ బీఆరెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తనదైన శైలిలో మాట్లాడారు. గతంలో కన్నా ఆమె స్పీచ్‌ భిన్నంగా, ఉన్నదున్నట్టుగా లోపాలను ఎత్తిచూపుతూనే భవిష్యత్‌ మార్గనిర్దేశనాన్ని సూచించినట్టుగా సాగింది. బుధవారం నగరంలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆరు డివిజన్ల బీఆరెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పనిచేయాలని కార్యకర్తలకు, లీడర్లకు ఆమె హితబోధన చేశారు. చిన్న చిన్న పనుల నిమిత్తం నాయకుల వద్దకు వస్తే అవి చేసి పెట్టాలన్నారు. బీఆరెస్‌ పార్టీ అంటేనే, గులాబీ కండువా అంటేనే ప్రజల కళ్లల్లో ఓ ఆశ, మెరుపు, భరోసా కనిపించేలా నాయకులు పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.

పదువులున్నా, లేకున్నా ప్రజా సేవకు అంకితం కావాల్సిందేనన్నారు. అప్పుడే పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని, నాయకుడికి ప్రజాదారణ మరింత పెరిగి పెద్ద లీడర్ అవుతాడని, పదవులు వరిస్తాయని ఆమె చెప్పుకొచ్చారు. బీఆరెస్‌ మహా సముద్రం లాంటి పార్టీ .. అన్ని పిల్లకాలువలు, వాగులు, వంకలన్నీ ఇందులోనే కలుస్తాయని ఆమె బీజేపీ, కాంగ్రెస్‌ నేతలనుద్దేశించి మాట్లాడారు. చివరకు ప్రతిపక్షంలోని ముఖ్యమైన లీడర్‌ షిప్‌ అంతా బీఆరెస్‌లోకి రావాల్సిందేనని, గులాబీ కండువా కప్పుకోవాల్సిందేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులకు హితబోధ చేయడంతో పాటు.. ఆమె ప్రతిపక్షాలకు అర్బన్‌ వేదికగా సవాల్‌ కూడా విసిరారు.

నిజామాబాద్‌లోని ఐదు నియోజకవర్గాల్లో బీఆరెస్‌ జెండా ఎగురబోతుందని, ప్రజల ఆశీర్వాదం తమకే ఉందన్నారు. ప్రతిపక్షాలు కొట్టుకుపోవాల్సిందేనన్నారు. ఆర్మూర్‌ వేదికగా అర్వింద్‌ బీఆరెస్‌కు సవాళ్లు విసిరితే.. కవిత పరోక్షంగా అదే అర్వింద్‌కు అర్బన్‌ వేదికగా మేమే వస్తాం కాస్కోండి చేతనైతే … అనే విధంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వేదికగా ఆమె చేసిన స్పీచ్‌ మరింత రాజకీయవేడి రాజుకునేలా చేసింది. పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని ఆమె అభయం ఇచ్చారు. దేశంలోనే ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీల సంఖ్య గణనీయంగా ఇక్కడ పెరిగిందని, గతంలో 23 శాతంగా ఉన్న నార్మల్‌ డెలివరీలు ఇప్పుడు 66 శాతానికి చేరాయన్నారు. ఇది కేసీఆర్‌ దూరాలోచన, కేసీఆర్‌ కిట్‌ పథకం వల్ల జరిగిన అద్భుతం అని చెప్పారు.

బీజేపీ ఉత్తి నినాదాల పార్టీ అని, జై జవాన్‌, జై కిసాన్‌ అంటూ సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకునే బాపతుగాళ్లే గానీ వాళ్లకు చేసిందేమీ ఉండదని అన్నారు. కేసీఆర్‌ కిసాన్‌లకే కాదు.. జవాన్ల కుటుంబాలను ఆదుకున్న చరిత్ర ఉన్నదని, అందుకే కేసీఆర్‌ అంతటి దేశభక్తుడు మరొకరు ఉండరన్నారు. ప్రభుత్వ డాక్టర్లకు చేతులెత్తి మొక్కాలని, రోగుల సంఖ్య తాకిడి పెరుగుతున్న ఓపికతో నార్మల్‌ డెలివరీలు చేస్తూ ప్రభుత్వం ప్రతిష్టను ఇనుమడింపజేయడంతో పాటు.. పేద మహిళలకు అండగా ఉంటూ వారికి కొత్త జీవితాలనిస్తున్నారని కొనియాడారు. అవకాశాలు అందరికీ వస్తాయని, అంతా ఓపికగా ఉంటూనే ప్రజలకు సేవ చేసే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని ఆమె హితవు పలికారు. మళ్లీ జిల్లాలో మన జెండానే ఎగరబోతుందని అన్నింటా మనమే గెలుస్తున్నామని ఆమె అన్నారు.

అక్క గెలిచి ఉంటే మరో ఐదేళ్ల అభివృద్ధి ఇప్పుడే జరిగేది : బిగాల గణేశ్‌గుప్తా..

ఎంపీగా కవితను ఓడగొట్టుకోవడంతో దరిద్రం పట్టుకున్నదని, ఆమె గెలిచి ఉంటే మరింకెంతో అభివృద్ది జరిగేదని అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నిజామామాద్‌ ప్రజలు ఎంతో దురదృష్టవంతులన్నారు. రాబోవు ఎన్నికల్లో కవిత గెలుపు చారిత్రాత్మకం కావాలని, ఆవిధంగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

You missed