అర్వింద్‌ పెత్తనంపై దండయాత్ర…

బాల్కొండ బీజేపీ టికెట్‌ తిరకాసుపై ఎదరుతిరిగిన సునీల్‌రెడ్డి…

మల్లిఖార్జున్‌రెడ్డికి ప్రజల్లో ఆదరణ లేదు.. అతనికెలా ఇస్తారు..? సర్వే చేయండి ఎవరికి ఇవ్వాలో తేలుతుంది..

అధిష్టానానికి అర్వింద్‌ వైఖరిపై సునీల్‌ ఫిర్యాదు..

టికెట్లు తన వాళ్లకేనని ప్రచారం చేసుకుంటున్న అర్వింద్….

ఇదేమైనా అర్వింద్‌ ఇంటిపార్టీయా..? బీజేపీ టికెట్లు అర్వింద్‌ ఎలా డిసైడ్‌ చేస్తాడు..

టికెట్‌ తనకేనంటూ ధీమా… అర్వింద్‌ పోరుకు రెడీ అంటూ కాలుదువ్వుతున్న సునీల్‌రెడ్డి…

వాస్తవం ప్రతినిధి- బాల్కొండ:

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌పై సొంత పార్టీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. తను చెప్పినట్టే పార్టీ నడుస్తుందనే సంకేతాలిస్తున్న అర్వింద్‌… నియోజకవర్గాల వారీగా తను అనుకున్న వాళ్లకే టికెట్లు దక్కుతాయని ప్రచారం చేసుకున్నాడు. ఇది బాల్కొండ నియోజకవర్గంలో బెడిసి కొట్టింది. ఇక్కడ ముత్యాల సునీల్‌ రెడ్డి బీజేపీ టికెట్‌ ఆశిస్తున్నాడు. అయితే అంతకు ముందే అన్నపూర్ణమ్మ తనయుడు మల్లిఖార్జున్‌ రెడ్డికి అర్వింద్‌ మాటిచ్చేశాడు. దీంతో సునీల్‌రెడ్డికి పార్టీలో చోటు లేకుండా పోయింది. టికెట్‌ తనకు ఇవ్వడం కుదరదనే సంకేతాలిచ్చాడు అర్వింద్‌. దీంతో అర్వింద్‌పై దండయాత్రకు సిద్దమయ్యాడు సునీల్. అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు.

మల్లిఖార్జున్‌ అసలు ప్రజల్లోనే లేని నాయకుడని, అతన్న ఎవరూ గుర్తు కూడా పట్టరని చెప్పుకొచ్చాడు. తను ఇంతకు ముందు మంత్రి ప్రశాంత్‌ రెడ్డిపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. తన సొంత చరిష్మాతో పాటు పార్టీ గుర్తుతో పోటీ చేస్తే గెలుపు సునాయసంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూ అధిష్టానానికి అర్వింద్‌ మొండి వైఖరిపై ఫిర్యాదు చేశాడు. తన సొంత ఇంటి పార్టీలా బీజేపీని మార్చేశాడని, తనకు నచ్చినవాళ్లను నియోజకవర్గాల్లో నియమించుకుని వాళ్లకే టికెట్లు కన్ ఫాం అంటూ పరోక్షంగా వారిని ఉసిగొల్పుతున్నాడని, ఇది పార్టీ సిద్దాంతానికి విరుద్దమని చెబుతున్నాడు.

సర్వే చేయించి చూడండి.. ఎవరి స్థానం ఎక్కడుంటుందో..? ఎవరికి టికెట్‌ ఇవ్వాలో తేలుతుంది..? అర్వింద్‌ వ్యక్తిగత ఇమేజ్‌ కోసం, ఈగో కోసం పార్టీని తాకట్టు పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మంత్రిని ఢీకొట్టే సత్తా తనకొక్కడికే ఉందంటూ అధిష్టానానికి ఇక్కడి వాస్తవికతను తెలియజేసే ప్రయత్నం చేశాడు. బాల్కొండలో మల్లిఖార్జున్‌ రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌లో కులాచారి దినేశ్‌, అర్బన్‌లో ధన్‌పాల్‌ సూర్యానారాయణ, బోధన్‌లో మోహన్‌రెడ్డి, ఆర్మూర్‌లో తనే పోటీ చేస్తానని అభ్యర్థులను దాదాపుగా ప్రకటించుకున్నాడని, దీన్ని పార్టీ పట్టించుకోకుండా వదిలేస్తే… భారీగా నష్టం జరుగుతుందంటూ వివరించాడు. అధిష్టానం ఇందూరు బీజేపీలో జోక్యం చేసుకుని అర్వింద్‌ అత్యుత్సాహానికి, ఒంటెత్తు పోకడలకు బ్రేక్‌ వేయకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదని పనిలో పనిగా బీజేపీ పెద్దలకు సూచన కూడా చేశాడు.

నిజంగా బీజేపీ బాల్కొండ నుంచి గెలవాలని కోరుకుంటే తనకే టికెట్‌ ఇవ్వాలని, ఇస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. బాల్కొండలో అర్వింద్‌ సపోర్టు లేకుండా గెలిచే దమ్ము తనకుందని, అతన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. బీజేపీ అసమ్మతి నేతగానే నియోజకవర్గంలో కలియతిరుగుతూ బీజేపీ నుంచి పోటీ చేసేది తనేనని, టికెట్‌ తనకే వస్తుందంటూ అర్వింద్‌కు కొరకరాని కొయ్యలా మారాడు. చూస్కుందాం రా నువ్వో నేనో అనే రేంజ్‌లో కయ్యానికి కాలుదువ్వుతూ సవాల్‌ విసురుతున్నాడు.

You missed