పరిహారం ౩౩ శాతం పైబడి నష్టపోయిన పంటలకేనా… మిగిలిన పంటల పరిస్థితేందీ..? ఆ రైతులకు దిక్కెవరు..?
వ్యవసాయశాఖ అంచనాల పూర్తి… ప్రభుత్వానికి నివేదిక..
౩౩ శాతంలోపు నష్టపోయిన రైతులకు దిక్కేది…… సీఎం సారు జర చూడుండ్రి.. రైతుల గోస…
నిజామాబాద్ జిల్లాలో పంటనష్టం @ 13, 566 ఎకరాలు … ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ..
నిజామాబాద్ ప్రతినిధి: వాస్తవం..
రైతులంతా చమటోడ్చారు. ఆరుగాలం శ్రమించారు. తీరా నోటికొచ్చిన కూడు గద్దల పాలైనట్టు.. అకాల వర్షం పంటలను నేలపాలు చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా చాలా చోట్ల వగగండ్ల వానలు పడటంతో వరి బాగా దెబ్బతిన్నది. కొన్ని చోట్ల కోతలకు రెడీగా ఉన్న పంట నేలరాలగా.. చాలా చోట్ల కోతలు కోసం కుప్పులు కొట్టి పెట్టుకున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోశారు. నేడో రేపు ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తామనగా.. పంటలు వర్షార్పణమయ్యాయి. లీడర్లు చేలల్లోకి వెళ్లి రైతులను పరామర్శించారు. పంటల పరిస్థితి గమనించారు. నష్టం అంచనా వేయమన్నారు. ప్రభుత్వానికి నివేదించి పరిహారం ఇస్తామని భరోసా ఇచ్చారు.
అంతా బాగానే ఉంది. కానీ వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం ౩౩ శాతం పైబడి నష్టపోతేనే దాన్ని అధికారులు లెక్కిస్తారు. ఆలోపు ఉంటే అది నష్టం కింద కాదన్నమాట. ఇదెక్కడి అన్యాయం అంటున్నారు. రైతులు. నష్టం నష్టమే కదా.. రైతులు నష్టపోతే అందరికీ న్యాయం చేయాలి గానీ .. ఈ నిబంధనలు, లెక్కల పేరిట కొందరికే న్యాయం చేస్తే ఎలా.. ? మా పరిస్థితి ఏంగాను అని ఆవేదన చెందుతున్నారు ఇంకొందరు రైతులు. రైతు ప్రభుత్వంగా చెబుతున్న సీఎం కేసీఆర్.. తమ గోడు వినాలని, నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నారు రైతులు.
నిజామాబాద్‌లో ఇలా…
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల రెండు రోజుల పాటు కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం, వడగళ్ల వానకు జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పంటలన్నీ కలిపి 13, 566 ఎకరాల్లో నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈనెల 24. 25 తేదీల్లో అకాల వర్షాలు పడ్డాయి. దీంతో వరి చాలా వరకు నేలకొరింది. అయితే వ్యవసాయ శాఖ నిబంధనల మేరకు ౩౩ శాతం పైబడి పంట నష్టపోతేనే దాన్ని నష్టం కింద పరిగణించి పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రాథమిక అంచనాలు పంపుతారు. ఈ లెక్కనే జిల్లా వ్యాప్తంగా 13,566 ఎకరాల్లో పంటనష్ట పోయినట్టు ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి పంపారు.
ఇందులో అత్యధికంగా వరి పంటనే ఉంది. వరి జిల్లా వ్యాప్తంగా 10, 437 ఎకరాల్లో నష్టపోయిందని అంచనా వేశారు. నువ్వులు 2212 ఎకరాల్లో , సజ్జలు 667 ఎకరాల్లో నష్టపోగా, మామిడి 25 ఎకరాల్లో నష్టపోయిందని అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపారు. అయితే ఈ పరిహారాన్ని ప్రభుత్వం ఎంత త్వరగా పంపితే రైతులకు అంత ఊరటగా ఉంటుంది. ఆలస్యమైతే రైతులు మరింత కృంగి పోతారు. ఎందుకంటే నష్ట పరిహారాన్ని ౩౩ శాతం పైగా ఉంటేనే తీసుకుంటున్నారు. ఆలోపు పంట నష్టపోయిన రైతుకు ఏమీ ఉండదు. ఆరుగాలం పండించిన పంట కళ్ల ముందే వర్షార్పణం అయినా ఎవరూ పట్టించుకునే దైన్య స్థితిలో రైతు ఉన్నాడు.