నాందేడ్‌ జిల్లాలో రెండోసారి బీఆరెస్‌ పెట్టిన బహిరంగ సభ సక్సెసయ్యింది. ఈసారి కేసీఆర్ తనదైన శైలిలో కాకుండా కొంత పంథా మార్చాడు. రైతల్లో ఇక్కడి తెలంగాణ పథకాలు ఎలా అమలవుతున్నాయో వివరిస్తూనే అక్కడ ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలనే చైతన్యాన్ని తన ప్రసంగం ద్వారా తెప్పించే ప్రయత్నం చేశాడు. చాలా సేపు ప్రసంగం చేయలేదు. కొద్దిసేపే మాట్లాడినా సూటిగా సుత్తి లేకుండా సాగింది స్పీచ్‌. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తనకు మహారాష్ట్రలో ఏం పని అని.. తెలంగాణ మీద దృష్ఠి పెట్టని హితవు పలికిన నేపథ్యాన్ని తీసుకొని దాని చుట్టే తన ప్రసంగాన్ని కొనసాగించాడు.

ఉచిత కరెంటు, రైతుబందు, రైతు బీమా, దళిత బందు పథకాలను ఇక్కడ అమలు చేస్తానని మాటిస్తే తాను రానని కూడా చెప్పడంతో సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. రానున్న పంచాయతీ ఎన్నికల్లోనే తన పార్టీని బలోపేతం చేయడం ద్వారా బీజేపీ దిగివచ్చేలా చేయొచ్చనే సందేశాన్ని మహారాష్ట్ర రైతులకు చెప్పాడు కేసీఆర్‌. కేసీఆర్ స్పష్టమైన హిందీలో అందరికీ అర్థమయ్యేలా మాట్లాడడం కూడా .. తను అనుకున్న విషయాన్ని అక్కడి ప్రజలకు చేరేందుకు దోహదపడింది. పార్టీలో పెద్దమొత్తంలో చేరకపోయినా.. సభకు జనం బాగానే వచ్చారు. కేసీఆర్‌ ప్రసంగం వారిలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చినట్టే అనిపించింది. ఇదర్‌ ధన్‌కీ కమీ నహీ హై.. మన్‌ కీ కమీ హై అన్నప్పుడు కేరింతలు, ఈలలు వేశారు సభికులు. ఆవేశంగా కాకుండా కేసీఆర్‌ ప్రసంగం చాలా కూల్‌గా సాగింది. అందరినీ ఆలోచింపజేసేలా కొనసాగింది.

You missed