నిజామాబాద్:

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అవాస్తవ, అర్ధరహిత విమర్శలకు స్వస్తి పలికి అభివృద్ధిలో తమతో పోటీ పడాలని ఆయా పార్టీల ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు మంత్రి వేముల సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 2 కోట్లతో ముప్కాల్ నుండి ఎస్సారెస్పీ పంపు హౌస్ వరకు చేపడుతున్న బి.టి రోడ్ డబుల్ లెన్ నిర్మాణ పనులకు,
రూ.81 లక్షలతో కొత్తపల్లి నుండి ముప్కాల్ వరకు నిర్మిస్తున్న బి.టి రోడ్ పునరుద్ధరణ పనులకు, వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామం నుండి పడగల్ వరకు రూ.60లక్షలతో పంచాయతీ రాజ్ బిటి రోడ్ పునరుద్ధరణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, మునుపెన్నడూ లేనివిధంగా వందల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రతి గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. బాల్కొండ సెగ్మెంట్లో చేపట్టిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే తరహాలో ఇకపై కూడా ప్రతి వారం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

ఓ వైపు తాము పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుంటే, కొంతమంది అవాస్తవ ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదన్నారు. అభివృద్ధిని విస్మరించి, అడ్డగోలు వ్యాఖ్యలతో ఇష్టారీతిన మాట్లాడితే సమాజం అసహ్యించుకుంటుందనే వాస్తవాన్ని గమనిస్తే మంచిదని హితవు పలికారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారు ఇచ్చిన హామీలను ఆటకెక్కిస్తే, తాము ప్రజలకు ఇవ్వని హామీలను కూడా ఆచరణలో అమలు చేసి చూపుతున్నామని అన్నారు. అభివృద్ధిలో ఎంతవరకైనా తాము పోటీ పడతామని, తిట్ల పురాణాలకు దిగడం, ఆడబిడ్డలను అవమానించేలా మాట్లాడే కుసంస్కారం తమకు చేతకాదన్నారు. ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్న వారి గురించి ఇకపై పట్టించుకోబోమని, అభివృద్ధి కార్యక్రమాలే ముఖ్య అజెండాగా ముందుకు సాగుతామని మంత్రి స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజలు గమనించాలని, అభివృద్ధికి అహరహం శ్రమిస్తున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో స్ధానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

You missed