స్నేహం అంటే ఇలా ఉంటుంది. ఒక్కసారి మనసులు ఒక్కటై… ఒకరికొకరు అర్థం చేసుకుని, కష్టసుఖాల్లో పాలుపంచుకుని .. అలా జీవిత కాలం కొనసాగుతారు. అలాంటి స్నేహమే బాజిరెడ్డి, సంజీవ్‌రెడ్డిలది. వీరిద్దరి స్నేహబంధం నలభై ఏళ్లది. పార్టీలు వేరైనా … వేర్వేరు పదవులు నిర్వహించినా… ఇద్దరు కలిసే తిరిగేవారు. కష్టసుఖాల్లో కలగలిసి ఉండేవారు. ఒక్కసారి బాజిరెడ్డితో స్నేహం చేస్తే ఆయన చిరకాలం ఎలా గుర్తు పెట్టుకుంటారో…? ఆ మిత్రులకు తన అండదండలు, సహాయ సహకారాలు ఎలా అందిస్తారో… ఈగ సంజీవ్‌రెడ్డి ఉందంతమే ఓ ఉదాహరణ.
టీఆరెస్ పార్టీ పుట్టిన నాటి నుంచి సంజీవ్‌రెడ్డి ఉన్నారు. రాష్ట్ర రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా 2011 వరకు ఆయన సేవలందించారు. కేసీఆర్ తో మంచి సాన్నిహిత్యం, కేసీఆర్, జయశంకర్ సార్ నిజామాబాద్ ఎప్పుడొచ్చినా ఆయన ఇంట్లోనే బస. చాలా మంది యువతరానికి సంజీవ్‌రెడ్డి గురించి తెలియదు. కానీ ఆయన పదవులు ఆశించే వ్యక్తి కాదు. 2011లో తన ఆరోగ్యం సరిగా సహకరించడం లేదని, తనే స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్లి తన పదవిని దివంగత వేముల సురేందర్‌రెడ్డికి ఇవ్వాల్పిందిగా కోరాడు. టీఆరెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు ఆయన కాంగ్రెస్‌లో పలు పదవులు చేపట్టారు. నిజామాబాద్ మండల జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్‌గా, తాలూక మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, హైదరాబాద్ రైల్వే డివిజన్ బోర్డు మెంబర్‌గా పలు పదవులు ఆయన చేపట్టారు. న్యాయం చేశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ 2014, 2018 ఎన్నికల్లో తన చిరకాల మిత్రుడు బాజిరెడ్డి గెలుపు కోసం తన వంతుగా విశేషంగా కృషి చేశారు సంజీవ్‌రెడ్డి. తన మిత్రుడు గెలుపులోతనూ ఇతోధికంగా ఉపయోగపడ్డారు. కానీ రాజకీయాల్లో మాత్రం స్తబ్దుగానే ఉంటూ వచ్చారు. బాజిరెడ్డికి ఎలాగైనా సంజీవ్‌రెడ్డిని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ చేయాలని కోరిక. చిరకాల మిత్రుడికి చిరుకానుకగా ఏదైనా పదవిని ఇచ్చి రుణం తీర్చుకోవాలనే తపన. మళ్లీ ప్రజాసేవలో సంజీవ్‌రెడ్డిని మమేకం చేయాలనే తండ్లాట. మొత్తానికి ఇలా జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవి రూపంలో ఓ అవకాశం వచ్చింది. దీనికి సంజీవ్ రెడ్డిని సమాయత్తం చేసి .. బరిలోకి దింపింది బాజిరెడ్డే. తనే స్వయంగా ఈ ఎన్నికలను ప్రత్యక్షంగా దగ్గరుండి పర్యవేక్షించారు. బాజిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వైరిపక్షంగా గడీల రాములు వర్గం తోకముడవక తప్పలేదు. దీంతో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఈగ సంజీవ్ రెడ్డి నియమితులయ్యారు. ఇలా చిరకాల మిత్రుడికి ఈ రూపంలో ఓ చిరుకానుక అందించారు బాజిరెడ్డి.
రాజకీయాల్లో ఓపిక చాలా అవసరం. ఇప్పటి తరంలో అది ఉండదు. పదవులు ఇంకా రాలేదే అనే ఆతృతే ఎక్కువ. కష్టపడి పనిచేయడం…. మనసు పెట్టి ప్రజాసేవలో లీనమవ్వడం.. పదవుల కోసం పరితపించకపోవడం కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి జాబితాలో సంజీవ్‌రెడ్డి ఉంటారు. ఆయన ఓపిక, చేసిన సేవ, మిత్రబంధం.. కాలం కలిసివచ్చేలా చేశాయి. స్తబ్దుగా ప్రజలకు, రాజకీయాలకు దూరంగా ఉన్న సంజీవ్‌రెడ్డి రాజకీయ జీవితానికి జీవం పోశారు బాజిరెడ్డి. మిత్రుడికి మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపి తనూ మురిసిపోయారు.