మునుగోడులో టీఆరెస్ విజయం సాధించడంతో టీఆరెస్ శ్రేణులు నిజామాబాద్‌లో సంబురాలు చేసుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తన క్యాంపు కార్యాలయం ముందు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. టీఆరెస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీకి ఇది చెంపపెట్టులాంటి తీర్పు. వాళ్లు ఏదో ఊహించుకున్నారు. సీఎం కేసీఆర్ బీఆరెస్ పెట్టిన తర్వాత ఈ జాతీయ పార్టీని ఇక్కడే నిలువరించాలని బీజేపీ అనేక అరాచకాలకు పాల్పడింది. డబ్బు మదంతో అడ్డగోలుగా మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చిన వ్యక్తులు టీఆరెస్ పార్టీని పడగొడతామని ప్రగల్బాలు పలికిన వీరికి తెలంగాణ ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సరైన సమాధానం చెప్పారన్నారు బాజిరెడ్డి.
జాతీయ పార్టీగా బీఆరెస్‌కు ఇది తొలిబోణి. ఇది మరింత బలాన్నిచ్చింది. ఈ విజయం కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, యువకులకు అందరికీ ఓ కొత్త శక్తినిచ్చింది. ఈ అద్బుతమైన రిజల్ట్‌ను అందించిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారాయన.
మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వం వారికి అందించిన సహాయసహకారాలను, భరోసాను, ఉద్యోగ భద్రతను దృష్టిలో పెట్టుకుని టీఆరెస్‌కు సపోర్టు చేశారన్నారు. వారికి కూడా ధన్యవాదాలు… ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ది ఈ విజయంలో కీలకంగా పనిచేశాయి. టీఆరెస్ పార్టీ కి ఈ తీర్పు మూలస్తంభంలాగా బలాన్నిచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ మరింత ముందుకు వెళ్లాలని, జాతీయ స్థాయిలో బీఆరెస్ పార్టీని బలపర్చాలని ఆకాంక్షించారు బాజిరెడ్డి గోవర్దన్….
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ సాంబారు మోహన్, జిల్లా యువకులు, జిల్లా పరిషత్ ఆర్థిక, ప్రణాళిక సంఘ సభ్యులు , ధర్పల్లి జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.