ఆర్జీవీ అన్న‌ట్టు కేసీఆర్ ఓ పాన్ ఇండియా హీరో అయ్యాడు. బీఆరెస్ పార్టీ పాన్ ఇండియా సినిమా అయ్యింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వీడియో ట్ర‌య‌ల‌ర్‌ను మోడీకి గిఫ్ట్ ఇచ్చాడు. ఇదో ట్ర‌య‌ల‌ర్ అన్న‌మాట‌. ముందుంది అస‌లు సినిమా అని చెప్ప‌క‌నే చెప్పాడు కేసీఆర్. వాస్త‌వంగా మోడీతో ఈ లెవ‌ల్‌లో పెట్టుకున్న‌ది ఎవ‌రూ లేరు. బీఆరెస్ ఆరంభ‌మే శుభారంభంగా కేసీఆర్‌కు క‌లిసి వ‌చ్చింది. మునుగోడులో టీఆరెస్ విజ‌యం త‌థ్యమ‌నే తేలింది.

ఇక ఇదే ఫ‌లితం ఊపుతో దేశ రాజ‌కీయాలు నెరిపేందుకు న‌డుం బిగించిన కేసీఆర్‌కు.. వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన‌ట్టు… పంతుళ్ల కొనుగోళ్ల సినిమా చేతికి చిక్కింది. కాగ‌ల కార్యం గంధ‌ర్వులు తీర్చిన‌ట్టు…మోడీ, అమిత్ షా వేశాలు, కొనుగోళ్ల డ్రామాలు, ప్ర‌భుత్వాలు కూల్చే కుట్ర‌ల‌కు ఇదో మంచిసాక్షంగా కేసీఆర్ భావించాడు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో ఎక్క‌డా మునుగోడు ఉప ఎన్నిక‌ల గురించి మాట్లాడ‌లేదు. అదో చిన్న‌విష‌యంగానే తీసుకున్నాడు. గెలుపు క‌చ్చితంగా టీఆరెస్ ఖాతాలో ప‌డుతుంద‌ని కేసీఆర్‌కు తెలుసు.

కానీ అక్క‌డ బీజేపీ వేసిన చిల్ల‌ర డ్రామాల గురించి మాత్ర‌మే మాట్లాడాడు. ఇక బీజేపీ ఏ విధంగా ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తుందో సాక్షాధారాల‌తో వీడియో పుటేజీల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చి మొత్తం దేశాన్ని త‌న‌వైపు తిప్పుకున్నాడు కేసీఆర్‌. ఇదొక్క తెలంగాణ స‌మ‌స్య కాదు… దేశం మొత్తంగా ఇదే జ‌రుగుతోంది. బీజేపీ శ్రేణులు, ఆర్ఎస్ ఎస్ వాదులు… దీన్ని స‌మ‌ర్థించ‌వ‌చ్చు. కానీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం బీజేపీకి స‌ర్వ‌సాధార‌ణం కావొచ్చు. అందుకే చాలా చోట్ల నాయ‌కులు బ‌హిరంగంగానే త‌మ‌కు ఫ‌లానా పార్టీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు.

ఏకంగా మోడీ సైతం ప‌శ్చిమ బెంగాల్‌లో ఇదే విధంగా మాట్లాడిన వీడియోను కేసీఆర్ బ‌య‌ట‌పెట్టి … ఆవు చేలో మేస్తే దూడ గ‌ట్టున మేస్తుందా..? అని ఇదంతా మోడీ, షాల క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తున్న కుట్ర అని బయ‌ట పెట్ట‌డంతో కేసీఆర్ ఒక్క‌సారిగా దేశ రాజ‌కీయాల‌ను ఆక‌ర్షించాడు. బీఆరెస్ ఇంకా పూర్తి స్థాయిలో బ‌య‌ట‌కు రాక ముందే ఓ వీడియో ట్ర‌య‌ల‌ర్‌తోనే కేసీఆర్ పాన్ ఇండియా సినిమా సూప‌ర్ హిట్ అయ్యి కూర్చుంది.

You missed