కొంత మంది బీజేపీ అభిమానులు. ఓ మీడియా… కలిసి ఓ వార్తను నిన్నటి నుంచి వైరల్ చేసి వదిలాయి. అదేమంటే… కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో తెలంగాణ పోలీసులు కూలీలుగా మారారని. ఏదో ఓ ఫోటో పోస్ట్ చేశారు. వీళ్లు పోలీసులా..? పాలేరులా..? అంటూ ఓ మీడియా దీనికి వంత పాడింది. అది నిజమా..? అబద్దమా..? అని కూడా చెక్ చేసుకుండా వార్త కుమ్మేసింది. వైరల్ చేసింది. సోషల్ మీడియా అలా తయారయ్యింది. పిచ్చోడి చేతిలో రాయిలా. మెయిన్ మీడియా కన్నా చాలా విషయాల్లో సోషల్ మీడియా ముందున్నది. ఎన్నో విషయాలను డేర్‌గా షేర్ చేసుకునే వేదికగా నిలుస్తున్నది. కాదనలేని సత్యం. కానీ కొంత మంది చేతిలో ఇది పచ్చోడి చేతిలో రాయిలా మారింది. అబద్దపు వార్తలను కమ్మేసి కుమ్మేసే ఓ వేదికగా మారింది. కావాలనే మార్పింగు ఫోటోలు, మార్పింగు వార్తలు, ఫేక్ న్యూస్ వీరికి ఆయుధాలు. వీటిని వండి వార్చి ఎక్కడెక్కడి ఫోటోలో తెచ్చి ఇక్కడికి ఆపాదించి దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం యథేచ్చగా సాగుతోంది. దీన్ని కంట్రోల్ చేయలేరు. అందుకే ఇది నిజం కాదురా బాబు..! పచ్చి అబద్దం అని నిరూపించి ఖండించే లోపు.. అది ఊరంతా ప్రచారం చేసి ఓ మూల కూర్చుంటుంది. అదన్న మాట సంగతి..
అసలేం జరిగింది..? ఇది వాస్తవంగా ఫామ్ హౌజ్ ఫోటో కాదు. వాళ్లు తెలంగాణ పోలీసులూ కాదు. కానీ ఇది నిన్న సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మల్లన్న క్యూన్యూస్ దీన్ని అచ్చు గుద్దినట్టు అలాగే దింపేసింది. దీంతో సీఎంఓ అలర్ట్ అయ్యింది. ఫాక్ట్ చెక్ చేసి ఇది ఫేక్ అని నిరూపించింది. కానీ అప్పటికే ఇది వైరల్ అయ్యింది. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఇలాంటి ఫేక్ వార్తలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రజలను తప్పుదోవ పట్టించి ఒకరిపై మరొకరు బురద జల్లుకునే ఈ ప్రయత్నం మున్ముందు మరింత రెచ్చిపోయి చేసే ప్రమాదమూ ఉంది. వీరిని నియంత్రించడం ఎవరి వల్లా కాదు. అందుకే ఇది పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. మొన్న మునుగోడు లో ఓ మీటింగులో రఘునందనే బీజేపీ శ్రేణులను స్వయంగా హితబోధ చేశాడు. ఎన్ని అబద్దాలైనా ప్రచారం చేయండి అని… ఇంక వాళ్లు ఊరుకుంటారా..? ఇలాగే రెచ్చిపోతారు. వంద అబద్దాలాడి ఓ పెళ్లి చేయాలనేది పాత సామెత… ఇప్పుడు వెయ్యి అబద్దాలాడైనా ఎన్నికల్లో గెలవాలి… ఇది బీజేపీ కొత్త సూత్రీకరణ…..