థియేట‌ర్‌లో సినిమాలు చూసి చాలా రోజులైంది. దీపావ‌ళి ఇచ్చిన స‌మ‌యం రెండు సినిమాలు చూసేందుకు వీలైంది. ఒక‌టి జిన్నా… రెండోది స‌ర్దార్.

జిన్నా … క‌థ ఎంపిక‌లో మంచు విష్టు త‌న న‌ట‌న‌, ఇమేజ్‌లాగే పూర్తిగా జారిపోయి పాతాళంలోకి ప‌డిపోయాడ‌ని మ‌రోసారి నిరూపించింది. ఫోర్న్ స్టార్ స‌న్నీ లియోన్‌ను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నప్పుడే త‌న‌ను చూసేందుకు ఎవ‌డూ థియేట‌ర్‌కు రాడు.. క‌నీసం స‌న్నీ అందాల ఆర‌బోత‌తోనైనా గ‌ట్టెక్కొచ్చ‌నే చీప్ మెంటాలిటీకి దిగ‌జారిపోయాడు మ‌నోడు. మ‌న తెలుగు సినిమా క‌థ‌లు ఎంత కొత్త‌గా , ఎంత ఆలోచించేవిగా, ఎంత ప్ర‌యోగాత్మ‌కంగా.. ఉంటాయో ఇదొక ఉదాహ‌ర‌ణ‌. అంటే.. తెలుగులో మంచి ద‌ర్శ‌కులే లేర‌ని, మంచి క‌థ‌లే క‌రువ‌య్యాయ‌ని, మంచి హీరోలో లేర‌ని కాదు ఇక్క‌డ ముచ్చ‌ట‌. తీసే కొన్ని సినిమాల్లో క్వాలిటీ ఎంత ప‌డిపోతుందో…. జిన్నా ఓ తాజా ఉదాహ‌ర‌ణ‌. బిల్డ‌ర్ ఎక్కువ బిజినెస్ త‌క్కువ … ఇదీ తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోని తెలుగు క‌థ‌ల‌, తెలుగు సినిమాల ప‌రిస్థితి. ఇలా వ‌చ్చి అలా పోతాయ‌న్న మాట‌. ఓ త‌మిళ సినిమా మాత్రం ఇక్క‌డ ఆడుతుంది. ఇక్క‌డ ఆ హీరో సీన్ల‌కు ఈల‌లు వేసే ఫ్యాన్సు ఉంటారు. క‌థ‌లలా ఉంటాయి. క‌నెక్ట‌వుతాయి. ఆక‌ట్టుకుంటాయి. చూడాల‌నిపించేలా చేస్తాయి. ప్ర‌యోగాలుంటాయి. క‌థ‌లో వెరైటీలుంటాయి. మ‌న ద‌గ్గ‌ర అవి చాలా త‌క్కువ‌.

నేను చెప్పేదిప్పుడు కార్తీ స‌ర్దార్ గురించి. మంచినీళ్లు ఎలా వ్యాపార‌మ‌య్యాయో.. ఆ బాటిళ్ల నీళ్లు తాగితే ఎలాంటి రోగాలొస్తాయో… ఇదెలా బిజినెస్ అయ్యిందో…. ఆ వ్యాపారం ఎలా ఎదిగి మాఫియాగా మారి కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిందో అనే అంశంతో ఇండియ‌న్ ఆర్మీ… గూఢ‌చారిగా కార్తీ… చైనా ఎత్తుగ‌డ‌లు … క‌థ చిన్న పాయింటే.. కానీ క్ష‌ణ‌క్ష‌ణం సినిమా క‌థ‌ను న‌డిపే తీరు బాగుంటుంది. అది మ‌న సినిమా కాద‌ని తెలుసు. అర‌వ వాసన వ‌స్తుంద‌నీ తెలుసు. కానీ క‌థ‌ను ప్రేమిస్తాం. క‌థ‌నాన్ని ఆస్వాదిస్తాం. కొత్త విష‌యాన్ని తెలుసుకోవాల‌నే ఆరాటం చూపిస్తాం. సందేశాన్ని గ్ర‌హిస్తాం. న‌ట‌న‌కు మార్కులేస్తాం. డైరెక్ట‌ర్ తెలివిత‌న‌నానికి, క్రియేటివిటీని మెచ్చుకుంటాం. గ్లామ‌ర్‌నే న‌మ్ముకుని ఫోర్న్ స్టార్‌నూ పెట్టుకున్నా.. ఆ థియేట‌ర్‌లో ప‌ట్టుమ‌ని ప‌ది మందీ ఉండ‌రు… ఇత‌ర భాష సినిమా అని తెలిసినా.. ఆ హీరో మ‌నోడు కాద‌ని తెలిసీ ఆ థియేట‌ర్‌కు మాత్రం ప‌దుల సంఖ్య‌లో ఉంటారు…. ప్రేక్ష‌కుడి నాడి ఎలా ఉందో ఇంకా తెలుసుకోలేని మ‌న టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఇంకా బాగుప‌డాలేమో.. ఇంకా బాగా విస్త‌రించాలేమో… ఇంకా బాగా ఆలోచించాలేమో.. హీరోయిక్ సినిమాల జోలి బాగా త‌గ్గించుకుంటే మేలేమో…?

Dandugula Srinivas

You missed