{మునుగోడు- ఉప ఎన్నిక}
స్పెషల్ స్టోరీ
అన్నీ తానై మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ ఉప ఎన్నిక అనివార్యమైన నాటి నుంచే పార్టీలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి రాజుకున్నది. కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్, కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి, తాడూరి వెంకట్‌రెడ్డి, రాజు, గుత్త సుఖేందర్‌రెడ్డి, అతని తనయుడు… ఇలా టికెట్ ఆశించిన వారి లిస్టు చాంతాడంత ఉంది. కానీ కూసుకుంట్లకే టికెట్ ఇప్పించుకోవడంతో పాటు… అసమ్మతి వాదులందరినీ ఏకతాటిపైకి తీసుకు వచ్చే క్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి వందశాతం సక్సెసయ్యాడు. అంతా తానై వ్యవహరించాడు. సీఎం కేసీఆర్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఇదొక ఇజ్జత్ కా సవాల్‌గా మంత్రి జగదీశ్‌రెడ్డి తీసుకున్నారు.
అప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంచార్జిలుగా వేసిన వారిని సమన్వయం చేసుకుంటూ వారి ప్రచార షెడ్యూల్‌ను ఎప్పటికప్పుడు రూపొందిస్తూ.. వారందరినీ సమన్వయం చేసుకోవడంతో పాటు అభ్యర్థి కూసుకుంట్ల విజయానికి తన శక్తికి మించి శ్రమపడుతున్నాడు. కేటీఆర్ స్వయంగా జగదీశ్‌రెడ్డి పడుతున్న శ్రమను గుర్తించారు. ఓ వేదికపై జగదీశ్‌రెడ్డి బీజేపీపై విసిరిసన సవాల్‌ను మంత్రి కేటీఆర్ సమర్థించారు. తాను ఆ సవాల్‌ను విసిరి …. బీజేపీని ఆత్మసంరక్షణలో పడేశాడు. నియోజకవర్గానికి 18వేల కోట్ల నిధులు ఇస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని ప్రకటించడం బీజేపీకి శరాఘాతంలా తాకింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన టీఆరెస్ కార్యకర్తలను, నాయకులను కూడా సమన్వయం చేసుకుంటూ జగదీశ్‌రెడ్డి అందరి సేవలను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు.
ఇక్కడ కమ్యూనిస్టులు బలాన్ని అంత ఈజీగా తీసిపారేయలేం. వారిని కూడా ఏకం చేసి పార్టీనికి సపోర్టు చేసే విధంగా సమన్వయం చేసిన వారిలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు కీలకంగా వ్యవహరించారు. టీఆరెస్‌కు ఉన్న బలంతో పాటు కమ్యూనిస్టుల అదనపు బలం టీఆరెస్ విజయానికి నల్లేరు మీద నడకలా మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.