వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడ్నుంచి పోటీ చేయాలో.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుస్తారో..? ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందో ఇప్పట్నుంచే లెక్కలేసుకుంటున్నారు. ఎవరి అంచనాలు వారికున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఆర్మూర్ నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నది. ఇక్కడ నుంచి పోటీని నేనంటే నేను అనే విధంగా అన్ని పార్టీల నుంచి పోటీ పెరుగుతున్నది. తాజాగా ఇక్కడ నుంచి పోటీ చేయడానికి అంకాపూర్ వాసి, వ్యాపారవేత్త రాకేష్ రెడ్డి కూడా రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలిసింది.
ఇప్పటికే బీజేపీ నుంచి పిలుపు రాగా… కాంగ్రెస్ కూడా రా రమ్మంటు పిలిచింది. కానీ రాకేశ్ రెడ్డి ఇతమిత్థంగా ఎటూ తేల్చుకోలేక … తన లెక్కల్లో తాను ఉన్నట్టు తెలుస్తోంది. పోటీ చేయడం అనివార్యం.. ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా ఇంట్రస్టు. ఎంపీగా చేస్తే ఎలా ఉంటుంది..? అని లెక్కలు. వీటి మధ్యలో.. ఈ సమీకరణలో ఆలోచనలో రాకేశ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ నుంచి అర్వింద్ ఆర్మూర్ నుంచి పోటీ చేస్తే.. తాను కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే…. ఓట్లు చీలి టీఆరెస్ అభ్యర్థికి గెలుపు అవకాశాలు దక్కితే….ఈ సమీకరణలు కూడా నడుస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ రాకేశ్ రెడ్డి సర్వే చేయించుకున్నట్టు తెలిసింది. కేంద్ర బీజేపీ పెద్దలతో కూడా సత్సంబంధాలు ఉండటం మూలంగా బీజేపీ నుంచి పోటీకే ఎక్కువ అవకాశాలున్నాయనే ప్రచారం ఆర్మూర్‌లో జరుగుతుంది.
ఒకవేళ అర్వింద్ ఎమ్మెల్యేగా ఆర్మూర్ నుంచి పోటీ చేస్తే.. తాను నిజామాబాద్ బీజేపీ ఎంపీగా బరిలో ఉండే అవకాశాల గురించి ఆలోచిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. కానీ, రాకేశ్ రెడ్డి కి తాను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలనే ఆలోచన కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. గురిడి కాపు సామాజికవర్గం కావడంతో ఇక్కడ మెజార్టీగా ఉన్న ఆ వర్గం తనకు అండగా ఉంటుందనే అంచనాలూ ఉన్నాయి. ఇప్పటికే ఈ వార్త అధికార పార్టీ చెవినా పడటంతో .. అతన్ని వారించే ప్రయత్నం చేసిందంట. కానీ రాకేశ్ రెడ్డి ఈ సారి కచ్చితంగా జిల్లా రాజకీయాల్లో కాలు మోపేందుకు సిద్దమయ్యాడు. ఆర్మూర్ పై ఆసక్తి ఉంది.. బీజేపీ వైపు ఆకర్షణ ఉంది. నిర్ణయమే మిగిలివుంది.