కేటీఆర్కు పార్టీ పగ్గాలివ్వగానే ఏదో అవుతుందనుకున్నారు. ఇంకేదో చేస్తాడనుకున్నారు. యువతకు మంచి అవకాశాలు లభిస్తాయనుకున్నారు. పార్టీ బలోపేతంలో, సంస్కరణలో తనదైన ముద్రవేస్తాడనుకున్నారు. కానీ అదేదీ జరగలేదు. ఇంకా పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. నామినేటేడ్ పదవుల కోసం వేచి చూసి చూసీ వేసారిపోయిన నాయకగణం.. కనీసం తమకు పార్టీ పదవులన్నా దక్కకపోతాయా..? అని అనుకున్నారు. కానీ ఎమ్మెల్యేలకు పార్టీ అధ్యక్షులుగా నియమించి చేతులు దులుపుకున్నాడు కేటీఆర్.
ఇది తీవ్ర అంసతృప్తి కారణం కాగా.. ఇప్పటి వరకు జిల్లా కమిటీలు లేవు, రాష్ట్ర కమిటీలు లేవు..వీటి అనుబంధ సంఘాల కమిటీలు లేవు… అలా స్తబ్దుగా ఉండిపోయింది. ఉండిపోయేలా చేశాడు కేటీఆర్. ఎందుకో ఏమో మరి తెలియదు. ఆయనకు పార్టీ ని ఎలా నడపాలో తెలియకనా..? ఎవరూ సరైన దిశానిర్ధేశం చేసేవారు లేకనా..? తెలియదు. పార్టీ మాత్రం ఆగమవుతుంది అన్ని జిల్లాల్లో. ఎమ్మెల్యేకు అధ్యక్ష పదవి ఇస్తే అతను నాన్ లోకల్. తన నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతను ఎదుర్కోవడానికే సరిపోవడం లేదు. బీజేపీ ఓ వైపు బలపడుతోంది. వచ్చేసారి టికెట్ రావడమే కల్ల. వస్తే గెలవడమే కష్టం. ఈ పరిస్థితుల్లో ఎవరింటి సంసారం వాళ్లు చక్కదిద్దుకోవడానికే సరిపోతున్నది. అలాంటప్పుడు వ్యతిరేక పవనాలను ఎదుర్కొంటున్న ఓ ఎమ్మెల్యేను తీసుకొచ్చి అధ్యక్షుడిగా ప్రకటించి జరిగే తమాషా చూస్తున్నాడు కేటీఆర్.
జిల్లా కమిటీలోనైనా ఏదైనా స్ధానం దొరుకుతుందా ..? అంటే అదీ లేదు. మీడియా ముందుకు వచ్చి దేనికైనా కౌంటర్ ఇవ్వాలన్నా ఏ పోస్టు లేక నోరు కట్టుకుని చేతులు ముడుచుకుని అలా ఉండిపోయారు ఉద్యమ బ్యాచ్.. టీఆరెస్ నాయకగణం అంతా. ఒక్కోజిల్లాలో కనీసం వెయ్యి మంది వరకు పార్టీ పదవులు వచ్చే అవకాశం ఉంది. వారంతా తమకు పార్టీ ఏదో గుర్తించి గౌరవమిచ్చిందని సంతోషపడేవాళ్లు. అదీ జరగలేదు. ఇప్పటికే నష్టం జరిగింది. ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదు.. తీవ్ర నష్టమే ఉంటుంది.
