అంతా ఇదే ఆసక్తి. ఉత్కంఠ. కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఇందూరుకు వస్తున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం తో పాటు అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీన్ని ఇందూరు బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించింది. కేసీఆర్ సభకు ముందే తాము ఓ సభ నిర్విహిస్తామని చెప్పి పర్మిషన్ కోరింది. కలెక్టర్ ఇవ్వలేదు. ఆఖరికి ఓచిన్న ఫంక్షన్ హాల్‌లో ఏదో అలా కార్యకర్తలు ,నాయకులతో మీటింగు పెట్టుకుని అయిందనిపించారు. దీనికి జర ఇందూరు జనతాకో జవాబ్ దో అని పేరు కూడా పెట్టుకున్నారు. అంతకు ముందు ప్రెస్‌మీట్‌లో అర్వింద్… తనకు ఇన్విటేషన్ రాలేదని, వస్తే తప్పకుండా వెళ్లి బహిరంగ సభలో మాట్లాడతాననీ అన్నాడు.
కానీ టీఆరెస్ శ్రేణులు దీన్ని ఖండించాయి. విమర్శించాయి. వెటకారం చేశాయి. ప్రొటోకాల్ ప్రకారం కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పిలుపుంటుంది కానీ, టీఆరెస్ బహిరంగ సభకు నిన్నెవడు పిలుస్తాడు…? రా మరి చేరు టీఆరెస్‌లో … నువ్వు వచ్చినా మేం పార్టీలోకి తీసుకోం…అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే సీఎం టూర్‌కు రెండు రోజుల ముందే అర్వింద్‌కు ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమానికి రమ్మని ఇన్విటేషన్ అందింది. శిలాఫలకం మీద ఉన్న ప్రొటోకాల్ పేర్లున్న ప్రతీ ఒక్కరికీ కలెక్టర్ స్వయంగా ఇన్విటేషన్ పంపి ఫోన్ చేసి చెప్పాడు. కానీ అర్వింద్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగానే ఉంటున్నట్టు తెలిసింది.
కేసీఆర్‌పై ఘాటుగా విమర్శలు చేసి… సవాళ్లు విసిరిన అర్వింద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోయినా.. గుంపులో గోవిందా లా అక్కడ గ్రూపు ఫోటో దిగి రావాల్సిందే. లోనికి అర్వింద్ మినహా ఎవ్వరికీ అనుమతుండదు. ఉప్పు, నిప్పులా రోజూ వాదులాడుకుని, విమర్శించుకునే అర్వింద్ ఒక్కడే ఓ వైపు…గులాబీ నాయకగణమంతా మరోవైపు అక్కడ ఉండటంతో అర్వింద్ ఈ కార్యక్రమానికి దూరంగానే ఉండాలని భావిస్తున్నాడని తెలిసింది. బహిరంగ సభకు ఇన్విటేషన్ లేదని అర్వింద్ అని నాలుక్కర్చుకోవడమే కాకుండా.. టీఆరెస్ శ్రేణుల ఎదురుదాడికి గురి కావల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రసంగం పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.