ఆయన సీనియర్ టీఆరెస్ నాయకుడు. చాలా ఏండ్లు పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా సేవలందిచాడు. లక్కీ అధ్యక్షుడిగా కూడా పిలిపించుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. జిల్లా అధ్యక్ష పదవి పోయింది. మాజీగా ఉన్నాడు. ఇంకా ఏ పదవులు లేవు. పదవులే కాదు.. పార్టీలో గౌరవమూ లేదు. చూసీ చూసీ ఓపిక నశించి… తిరిగి తిరిగి అడిగి అడిగి… విసిగి వేసారి.. రాజకీయాలంటేనే వెగుటుపట్టేసినట్టుంది. ఇక వద్దురా బాబు ఈ రాజకీయాలు అని .. తన సుధీర్ఘ రాజకీయ జీవితానికి గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటించి తన శేషజీవితాన్ని రాజకీయాలకు దూరంగా గడిపేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఈగ గంగారెడ్డి. నిజామాబాద్ టీఆరెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్టుగా ఉంటున్నాడు. పార్టీ అధిష్టానికి వీర విధేయుడు. కానీ కాలం కలిసిరాలేదు. పదవులు రాలేదు. జిల్లా అధ్యక్ష పదవితో రెండు టర్మ్‌లు కొనసాగాడు. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని నియమించారు. అప్పట్నుంచి తనకు ఆ పదవి కూడా లేదు. ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇవ్వండని తిరిగాడు. అభయం, హామీలే తప్ప ఏమీ కాలేదు. కాదని కూడా తెలిసిపోయింది. తత్వం బోధపడ్డది. పైగా మొన్నటి వరకు ముందు వరసలో ఉండి మీడియాతో మాట్లాడిన ఈ నేత… ఇప్పుడు వెనుక బెంచికి పరిమితమయ్యాడు ఎవరికీ కనిపించనంతగా. ఇక ఇంతకన్న అవమానం ఉంటుందా..? అని అనుకున్నాడు. ఇక చాలు … గుడ్ బై చెప్పేద్దామని డిసైడ్ అయ్యాడు. త్వరలో ప్రకటన రానుంది.