ఆర్మూర్ నియోజకవర్గంపై ప్రతిపక్షాలు గంపెడాశలు పెట్టుకుంటున్నాయి. ఇక్కడి నుంచి ఈజీగా గెలవచ్చనే ధీమాలో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడ క్యాండిడేట్ లేరు. కానీ అర్బన్ నుంచి మహేశ్‌కుమార్ గౌడ్ ఇక్కడి నుంచి పోటీకి ఉవ్విళ్లూరుతున్నాడు. గతంలో అర్బన్ నుంచి బీఎస్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కూడా ఆర్మూర్ బరినే ఎంచుకున్నాడు.
రెండు సార్లు బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వినయ్ రెడ్డి.. ఈ సారి ఇక్కడి నుంచి తన చిరకాల మిత్రుడు, శత్రవు అయిన జీవన్‌రెడ్డిపై పోటీ చేసి గెలవాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు. కానీ అర్వింద్ అనూహ్యంగా ఇక్కడి నుంచి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో వినయ్ రెడ్డి ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. అర్వింద్ ఆర్మూర్‌లోనే ఇల్లు, ఆఫీసు ఏర్పాటు చేసుకుని ఈ కేంద్రంగానే రాజకీయాలు నడుపుతున్నాడు.
మొదట తన ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కోరుట్ల నుంచి పోటీకి సిద్దమయ్యాడు. కానీ ఆర్మూర్ బరిని ఎంచుకుని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఇక్కడ మున్నూరుకాపు ఓట్లు అధికంగా ఉండటం..పసుపుబోర్డు ఎఫెక్ట్ అంతగా లేకపోవడంతో ఈజీగా గెలవచ్చని భావిస్తున్నాడు.