కేసీఆర్ వ్యూహం మార్చాడు. ఉప ఎన్నిక ఏదైనా దూకుడుగా యుద్ద‌రంగంలోకి దూసుకెళ్ల‌డం కేసీఆర్ స్టైల్‌. అన్ని ఉప ఎన్నిక‌ల్లో దాదాపుగా ఆయ‌న స్టైల్ అదే. కానీ ఇప్పుడు వ‌చ్చిన మునుగోడు ఉప ఎన్నిక చాలా కీల‌కం. బీజేపీ ఈ స్థానాన్ని గెలిచి రానున్న మధ్యంత‌ర ఎన్నిక‌ల్లో మాదే పై చేయి అని చెప్పుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న‌ది. మ‌రోవైపు కొన్ని ప‌త్రిక‌లు ప‌ని గ‌ట్టుకుని కేసీఆర్‌ను ఇర‌కాటంలో పెట్టే వార్త‌లు రాశాయి. ఈ మునుగోడు టీఆరెస్ గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని, తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న‌ద‌ని, ఇది ఓడిపోతే రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీకి క‌లిసి వ‌స్తుంద‌ని అందుకే… ఈ ఎన్నిక జ‌ర‌గ‌కుండా కేసీఆర్ చూస్తున్నాడ‌ని, ముంద‌స్తు కు వెళ్తాడనీ రాశాయి. దీంతో కేసీఆర్ వార్త‌ల‌కు త‌న‌దైన శైలి లో ఘాటుగానే తిప్పికొట్టాడు.

రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నిమిషాల వ్య‌వ‌ధిలోనే దాన్ని ఆమోదింప‌జేసి ఉప ఎన్నిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. కానీ గ‌తంలో జ‌రిగిన గుణ‌పాఠాలు కేసీఆర్ స్టైల్‌ను మార్చాయి. హుజురాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో త‌న బ‌లాన్నంతా కేసీఆర్ ప్ర‌యోగించినా ఫ‌లితం లేక‌పోయింది. వాటిని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా కేసీఆర్ తీసుకున్నాడ‌నే సంకేతాలు వ‌స్తే చాలు ప్ర‌తిప‌క్షాలు వాటిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్నాయి.

ఈ సారి కేసీఆర్‌ను ఓడగొట్టండి. అహంకారం వీడుతుంది. దిగొస్తాడు. ప్ర‌జ‌ల మాటింటాడు… అంటూ ప్ర‌చారం చేసి ఫ‌లితాల‌ను త‌మ‌కు అనుకూలంగా వ‌చ్చేలా వ్యూహం ప‌న్ని స‌క్సెస‌య్యారు. ఇప్పుడ‌లాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా .. అస‌లు ఈ మునుగోడు ఉప ఎన్నిక మాకు పెద్ద ప‌ట్టింపులేద‌న్న‌ట్టుగా, లైట్ గా తీసుకుంటున్నామ‌న్న‌ట్టుగా కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా మౌనంగా ఉంటున్నారు. తెర వెనుక ఏమేమీ చేయాలో అవ‌న్నీ చేస్తాడు. పోల్ మేనేజ్‌మెంట్‌తో విజ‌యం ఎలా సాధించాలో సాధించి తీరుతాడు. కానీ ఎక్క‌డా అది బ‌య‌ట‌కు క‌నిపించ‌దు. ఆర్బాటం ఉండ‌దు. హంగామా ఉండ‌దు. కేవ‌లం గెలుపే క‌నిపించాలి. అందు కోసం వ్యూహాత్మ‌కంగా ముందుకు పోవాలి. మౌనంగానే ఉంటూ విజ‌య‌తీరాల‌కేగాలి. ప్ర‌తిప‌క్షాల‌కు దిమ్మ‌దిరిగే షాక్ ఇవ్వాలి…. ఇదే కేసీఆర్ మ‌దిలోని వ్యూహం… ఇప్పుడ‌దే అమ‌లవుతోంది.