కొత్త పింఛన్ల జోలికి పోకి మూడేండ్లు దాటింది. ఉన్న పింఛన్లే నెలనెలా సరిగా ఇవ్వటం లేదు. ప్రతినెలా చనిపోయిన వారిని తొలగిస్తూ పోతున్నారు తప్ప కొత్త వారికి మాత్రం పింఛన్లు ఇవ్వడం లేదు. ఏండ్ల తరబడి వేచి చూసి చాలా మంది విసిగి వేసారిపోయారు. సర్కార్‌ను తిట్టుకున్నారు. వీరికే దిక్కులేదంటే…. వయస్సు తగ్గించిన వృద్దాప్య పింఛన్లు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంది. అవి లేవు.. ఇవీ లేవు. ఎవరో ఒక మంత్రి ప్రతీ నెలా ఏదో ఒక మీటింగులో ఇగో వచ్చేనెలే .. కొత్త పింఛన్లు .. వచ్చేస్తాయ్.. వచ్చేస్తాయ్.. అంటూ ఊరించి పోవడమే తప్ప వాటిని అమలు చేసిందే లేదు.
అసలు వీళ్ల మాటలు గవర్నమెంటులో పట్టించుకునేదెవరు..? అక్కడ కేసీఆర్ ఓకే అంటేనే.. ఫైలు ముందుకు కదిలేది. ఎవరెన్ని చెప్పినా అక్కడ ఏమీ కాదు. కేసీఆర్ అన్ని లెక్కలేసుకుని.. ఆదాయం, ఖర్చు, అప్పులు, హామీలు… ఇలా అన్ని సరిచూసుకుని, తీరిగ్గా ఇలా మూడేండ్ల తర్వాతైనా సరే ఇస్తాడన్న మాట. మరి ఆయనేం చెప్పలేదు కదా కొత్త పింఛన్లు వచ్చే నెల నుంచి వస్తయని…? ఎలా నమ్మేది అంటారా. చెప్పిందెవరు..? యువరాజు. షాడో సీఎం.ఇప్పుడు నమ్మొచ్చు. ఆయన మాట కూడా చెల్లుబాటు కాదనే డౌటుందా…? మీ డౌట్‌కు ఆన్సర్ నా దగ్గర లేదు కానీ… వచ్చే నెల దాకా ఓపికపట్టండి…
