భూ రికార్డుల న‌మోదు.. సంస్క‌ర‌ణ‌ల్లో ధ‌ర‌ణికి మించింది లేదు.. ఇది స‌ర్వ భూ స‌మ‌స్య‌ల‌కు స‌ర్వ రోగ నివార‌ణి అంటూ ప్ర‌భుత్వం ఎంత ఢంకా బ‌జాయించినా.. క్షేత్ర‌స్థాయిలో ఈ భూ స‌మ‌స్య‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పైగా కొత్త చిక్కుల‌ను తెచ్చిపెడుతున్నాయి. స‌ర్కార్‌కు త‌ల‌వంపులు త‌ప్ప‌డం లేదు. ఈ స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌డానికి స‌ర్కార్ రెవెన్యూ స‌ద‌స్సులు పెట్టాల‌ని భావించింది. వ‌ర్షాల నేప‌థ్యంలో ఇవి వాయిదా ప‌డ్డాయి. త్వ‌ర‌లో ఈ డేట్లు స‌ర్కారు ప్ర‌క‌టించ‌నుంది. కానీ ఈ స‌ద‌స్సుల వ‌ల్ల భూ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు. ధ‌ర‌ణిలో ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో చెప్పి అవ‌గాహ‌న చేసుకోవ‌డానికే ఇవి ప‌రిమితం కానున్నాయి. ఇప్ప‌టికే నూటికి తొంభై శాతం మంది ధ‌ర‌ణికి అప్లై చేసుకుని ఉన్నారు. మళ్లీ వీళ్లంద‌రితో కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేపించి పంపించుడే త‌ప్ప‌… పెద్ద‌గా ఒరిగేదేమీ ఉండ‌దు. అస‌లు స‌మ‌స్య‌ను ప‌క్క‌న బెట్టి ఇలా రెవెన్యూ సద‌స్సుల పేరుతో జ‌నాల‌ను తింపించ‌డం ….ఇంకా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేద‌ని స‌ర్కార్‌ను తిట్టుకోవ‌డం త‌ప్పితే ఇంకా ఏమీ పెద్ద‌గా ఒరిగేదుండ‌దు.

మొత్తం 30 మంది అధికారులు చేయాల్సిన ప‌నంతా.. ఒక్క క‌లెక్ట‌ర్‌కే అప్ప‌గించి ….భూ స‌మ‌స్య‌లు ప‌రిష్కారించాల‌ని ప్ర‌భుత్వం యోచించ‌డ‌మే పెద్ద త‌ప్పు. కింది స్థాయిలో త‌హ‌సీల్దార్ల‌కు, ఆర్డీవోకు ప‌వ‌ర్స్ ఇవ్వ‌కుండా ఒక్క క‌లెక్ట‌రే ఎంక్వైరీ చేసి అన్నీ స‌రిగ్గా ఉన్నాయ‌ని చూసి ఓకే చేయ‌డం కుద‌ర‌దు. అందుకే క‌లెక్ట‌ర్లు చాలా ద‌రఖాస్తుల‌ను రిజ‌క్ట్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు రెవెన్యూ సిబ్బంది మీద గురి లేదు. అస‌లు న‌మ్మ‌క‌మే లేదు. ఆయ‌న దృష్టిలో రెవెన్యూ అధికారులు దొంగ‌లు. అవినీతి ప‌రులు. ఇక ఎలా త‌హ‌సీల్దార్ల‌కు, ఆర్డీవోల‌కు అధికారాలిస్తాడు. ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య వ‌చ్చి పడింది. ఇది మార్చ‌నంత కాలం… దీంట్లో మార్పులు చేయ‌నంత కాలం… ధ‌ర‌ణి స‌మ‌స్య‌లు వుంటూనే ఉంటాయి. ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతూనే ఉంటారు. సర్కార్‌పై వ్య‌తిరేక‌త పెరుగుతూనే ఉంటుంది.